Sun Dec 08 2024 08:55:57 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఖాళీ అవ్వడం గ్యారంటీ... స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇక చాప చుట్టేయడమేనా?
వైసీపీలో నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీలో నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్ల స్థాయి నుంచి ఇప్పుడే వలసల పర్వం మొదలయింది. ఇక ఆగేట్లు లేదు. ఎందుకంటే ఇంకా ఐదేళ్లు అధికారంలో లేకుండా ఉండలేని పరిస్థితి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటి వరకూ వైసీపీ పాలనలోనే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహజంగా ఎమ్మెల్యేలు తమ పట్టును నిరూపించుకునేందుకు వలసలను ప్రోత్సహిస్తారు. పార్టీలో చేర్చుకుంటారు. వాళ్లకు కావాల్సింది అధికార పార్టీలో ఉండటం. ఎమ్మెల్యేలకు కావాల్సింది స్థానిక సంస్థల మీద పట్టు పెంచుకోవడం.
నాడు దగ్గర తీసిన నేతలే....
దీంతో వైసీపీలో నేతలు ఇక మిగలరన్నది వాస్తవం. ఇన్నాళ్లు నా ఎస్టీలు.. నాఎస్సీలు.. నా బీసీలు.. నా మైనారిటీలు అంటూ ఎక్కువ పదవులను జగన్ వారికే కట్టబెట్టారు. ఇప్పుడు ఎక్కువశాతం మంది పార్టీ మారే వాళ్లలో వారే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు చేసే ప్రలోభాలను చూసికావచ్చు. ఐదేళ్ల తర్వాత చూసుకుందాంలే అన్న ధీమా కావచ్చు. వరసగా నేతలు కూటమి పార్టీ వైపు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే తమకు నిధులు అందవు. ఆధిపత్యం కొనసాగించడానికి వీలుండదు. నామినేటెడ్ పనులు కూడా చేసుకునే వీలుండదు. అందుకే అన్నీ దక్కాలంటే జెండా మార్చేయడమే బెటర్ అన్న ఆలోచన అందరిలోనూ బయలుదేరింది.
ప్రారంభమయిన వలసలు...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వీడారు. ఇక తాజాగా విశాఖలో ఇరవై మంది వరకూ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే కూటమి పరం కానుంది. మేయర్ లను, మున్సిపల్ ఛైర్మన్ లను దించి తమ వారిని పదవిలో కూర్చోబెట్టడమే అధికార పార్టీ లక్ష్యం. అప్పుడే తమ పార్టీ జెండా కార్పొరేషన్, మున్సిపాలిటీల మీద ఎగురుతుందన్న ఆశాభావంతో ఎమ్మెల్యేలు దగ్గరుండి వలసలను ప్రోత్సహిస్తున్నారు. అయితే వీళ్లకు ప్రత్యేకంగా వచ్చే ఎన్నికల్లో తిరిగి సీటు ఇస్తామన్న హామీలతోనే పార్టీ మారుతున్నారని తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలోనూ....
పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ఖాళీ చేస్తుంది. దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సేమ్ సీన్ ఏపీలోనూ ప్రారంభమయింది. రాజకీయాల్లో ఇది మామూలు అయినప్పటికీ.. దీపం చుట్టూ పురుగులు చేరినట్లుగానే అధికారం చుట్టూ నేతలు తిరుగుతుంటారు కాబట్టి ఇందులో ప్రత్యేకంగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వారిని ఆపేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఎందుకంటే వారికి అధికారం లేదు. వాళ్లు చెప్పే మాటలు రుచించవు. చెవికెక్కవు. అధికారం కోసమే వెళుతున్నారు కాబట్టి ఇక వారిని ఆపడం ఎవరి తరమూ కాదు.
Next Story