Fri Dec 05 2025 09:29:53 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : చేరికలు లేని జనసేన.. అసలు రీజన్ ఇదేనటగా?
జనసేనలో చేరికలు నిలిచిపో్యాయి. నేతలు ఎవరూ జనసేనలో చేరకపోవడానికి కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది

జనసేనలో చేరికలు నిలిచిపో్యాయి. గత కొద్ది రోజుల నుంచి కార్పేటర్లు మినహాయించి అదీ అవసరమైన విశాఖ వంటి ప్రాంతాలల మాత్రమే చేరికలు జరిగాయి. అంతే తప్ప ఒక స్థాయి నేతలు ఎవరూ జనసేనలో చేరకపోవడానికి కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పటయిన తొలినాళ్లలో జనసేనలో భారీ స్థాయిలో చేరికలు కొనసాగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయ భాను, కిలారు రోశయ్య తదితరులు పార్టీలో చేరారు. దీంతో ఇంకా అనేక మంది క్యూ లో ఉన్నారన్న ప్రచారం సాగింది. అయితే కొందరు నేతలు టీడీపీ వైపు వెళ్లిపోయారు. కాపు సామాజికవర్గమయినా ఆళ్ల నాని టీడీపీలో చేరిపోయారు.
యాక్టివ్ గా లేకపోవడంతో...
అయితే చేరిన వారంతా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో పాటు వారికి ప్రాధాన్యత కూడా దక్కడం లేదన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. జనసేనలో చేరితే అక్కడ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లాలంటే ముందు చాలా మంది నేతలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని, కండువా కప్పే సమయంలో తప్ప మరోసారి ఆయనను కలిసే అవకాశముండదని అర్థమయింది. వైసీపీలో జగన్ తరహాలోనే ఇక్కడ కూడా ఉండటంతో రెండింటికీ పెద్ద తేడా ఏముందన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. తోట త్రిమూర్తులు వంటి వారు కూడా జనసేనలోకి వస్తారని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దయెత్తున నేతలు వచ్చి చేరిపోతారన్న ప్రచారం చివరకు ప్రచారానికే పరిమితమయింది.
ఆసక్తి చూపని పవన్...
కానీ చేరికలకు పవన్ కల్యాణ్ పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదని తెలిసింది. నేతలు ఎక్కువయ్యే కొద్దీ అనవసర టెన్షన్ తప్ప మరొకటి ఉండదని భావించి పవన్ కల్యాణ్ చేరికలకు సుముఖంగా లేరంటున్నారు. ప్రస్తుతం సాఫీగా సాగుతున్న పార్టీలో కొత్త వారిని చేర్చుకుని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ఆయన ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. విశాఖ నేత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇలా అనేక మంది నేతలు ప్రయత్నించినప్పటికీ పవన్ కల్యాణ్ రెడ్ సిగ్నల్ వేయడంతోనే వారు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారని కూడా అంటున్నారు.
ఉన్న పార్టీలోనే ఉండి...
మరొకవైపు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి బయలుదేరిందని, కేవలం అమరావతి మీదనే ఫోకస్ పెట్టడం, రాజధాని నిర్మాణానికే నిధులు కేటాయించడం, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే జనసేన, టీడీపీలో చేరడం కంటే వైసీపీలో కొనసాగడమే మంచిదన్న ఆలోచనలో కూడా కొందరు ఉన్నారు. నేతలు అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఇతర పార్టీలో చేరడం కంటే ఉన్న పార్టీలోనే ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్న భావనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద జనసేనలో చేరికలు లేవని అంటున్నారు. మరి ఏది నిజమనేది చూడాలి
Next Story

