Mon Feb 16 2026 15:51:30 GMT+0530 (India Standard Time)
రాజకీయాలకు జేడీ గుడ్ బై.. ఉద్యోగంలో చేరిపోయిన లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఆయన తనకు రాజకీయాలు అచ్చిరావని నమ్మారు. తన ఆలోచనలతో రాజకీయాలు చేయడం చేయడం అంత సులువు కాదని గుర్తించిన లక్ష్మీనారాయణ ఆయన తిరిగి ఉద్యోగంలో చేరిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ మేఘా గ్రూపులో ఉద్యోగంలో చేరారు. ఈవీ ట్రాన్స్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టారు. ఏదో ప్రజలకు చేయాలని రాజకీయాల్లో వచ్చిన జేడీ లక్ష్మనారాయణ, తనను ప్రజలు ఆదరించకపోవడంతో పాటు డబ్బు, కుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందని తెలిసి ఇక పాలిటిక్స్ కు బైబై చెప్పేశారు. తాను ప్రజలకు చెప్పిన మంమచి మాటలు వారి చెవికి ఎక్కకపోవడంతో పాటు ఇక రాజకీయాల్లో రాణించలేనని గ్రహించి తనకు నచ్చిన వృత్తిని ఎన్నుకున్నారు.
ఆర్థికంగా కూడా...
జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో లేకపోయినా ఆయన స్వచ్చంద సంస్థ ద్వారా రైతులకు, యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు సైబర్ మోసానికి గురయ్యారు రెండున్నర కోట్ల వరకూ నష్టపోయారు. దీంతో ఆయనకు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో జేడీ లక్ష్మినారాయణ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. సీబీఐ జేడీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసీ మైనింగ్ కేసులను అత్యంత పకడ్బందీగా డీల్ చేసి లక్ష్మీనారాయణ వార్తల్లో నిలిచారు. చివరికి లంచాలు తీసుకుంటున్న జడ్జిలను కూడా పట్టుకుని వ్యవస్థలో తన నిజాయితీని చాటుకున్నారు. అనంతరం మహారాష్ట్ర కేడర్‌కు వెళ్లిన ఆయన, పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
జనసేన నుంచి బయటకు వచ్చి...
జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నించిన లక్ష్మీనారాయణ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను ఓట్లుగా మలచుకోవడంలో విఫలమయ్యారు. 2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు. చివరికి ఆయన వీటన్నింటినీ వదిలేసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు. రాజకీయాలను వదిలేసిన జేడీ లక్ష్మినారాయణ ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోయడం కోసం మరోసారి తనకు తెలిసిన వృత్తిని చేపట్టడానికి సిద్ధమయ్యారు.
Next Story

