Sat Jan 24 2026 09:27:16 GMT+0000 (Coordinated Universal Time)
Jc Prabhakar Reddy : జేసీ ఇక అంతే.. తట్టుకోవాలంటే కష్టమే
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర హోంశాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర హోంశాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తి వెనక అనేక కారణాలున్నాయంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ పోలీసులు తమ మాట వినడం లేదన్న అక్కసు ఆయనలో కనపడుతుంది. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో గతంలో పోలీసులపైనే ఆయన ధ్వజమెత్తారు. అయితే తన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి రివాల్వర్ లైసెన్స్ ను రెన్యువల్ చేయలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనేక సార్లు రాష్ట్ర హోం శాఖకు వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆయన వాపోయారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటన్నది ఆయన ప్రశ్న.
గతంలోనూ ఇంతే...
కొంతకాలం ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీనివల్ల టీడీపీ పై సాధారణ ప్రజల్లో ఒకరకమైన వ్యతిరకేత భావం ఏర్పడుతుందని టీడీపీ నాయకత్వం కూడా భావించింది. రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేయాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ రోహిత్ చౌదరి పదవీకాలాన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించడం వెనక కూడా జేసీ నోటికి కళ్లెం వేయడానికేనని అంటున్నారు. మరో ఏడాదిపాటు తాడిపత్రి ఏఎస్పీగా కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఎస్పీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనక ఆయనకు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు పంపిచినట్లయింది. ఇలా జేసీ గత కొంతకాలంగా హోంశాఖ తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతూనే ఉన్నారు.
అసలు ఆగ్రహానికి...
తాజాగా ఆయన ఆగ్రహానికి కారణం.. తన ప్రత్యర్థి పెద్దారెడ్డితో తలపడాలని బయటకు వస్తే తమను కూడా పోలీసులను అడ్డుకోవడంతో ఆయన ఇగో హర్ట్ అయినట్లు తెలిసింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు రెండు వర్గాలను బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డికి మాత్రం తమనే అడ్డుకుంటారా? అని ఆగ్రహం చెందినట్లు అర్థమవుతుంది. హోంశాఖ అనేది లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసమేనని, జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తే అక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే అది పార్టీకి, ప్రభుత్వానికి చుట్టుకునే అవకాశముంటుందని, అది తెలిసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి హోం శాఖపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.
Next Story

