Sat Jan 10 2026 22:50:19 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు నేత జంగా పంతం ఎక్కడా నెగ్గడం లేదుగా?
పల్నాడులోని గురజాల నేత జంగా కృష్ణమూర్తి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు

పల్నాడులోని గురజాల నేత జంగా కృష్ణమూర్తి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు. వైసీపీలో ఉండి ఎమ్మెల్సీ పదవి పొందినప్పటికీ గురజాల శాసనసభ టిక్కెట్ ను పొందలేకపోయారు. ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆయనకు భవిష్యత్ లో శాసనసభ టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. మళ్లీ ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మరొకవైపు తాజాగా జంగా కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక భూ కేటాయింపును రద్దు చేయడమేనని అంటున్నా జంగా కృష్ణమూర్తిలో పార్టీ వైఖరి పట్ల అసంతృప్తి కూడా ఒక కారణమన్న వాదన బలంగా వినిపిస్తుంది.
ఎమ్మెల్సీ పదవి వచ్చినా...
వైసీపీ అధికారంలోకి రాకముందే బీసీ కోటలో ఎమ్మెల్సీ పదవిని జంగా కృష్ణమూర్తి పొందారు. అయితే ఆయన వైసీపీలో గురజాల టిక్కెట్ ను ఆశించారు. కానీ వైసీపీ అధినేత కుదరదని చెప్పడంతో జంగా కృష్ణమూర్తి 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జంగా కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. తిరుమలలో తాను నేతృత్వం వహిస్తున్న ట్రస్ట్ కు గెస్ట్ హౌస్ నిర్మించడం కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భూమిని కేటాయించారు. అయితే తాజాగా టీటీడీ ప్రయివేటు వ్యక్తుల భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది. పవన్ కల్యాణ్ వినతిని కూడా టీటీడీ బోర్డు తోసి పుచ్చింది. అందువల్ల జంగా కృష్ణమూర్తి కేవలం భూ కేటాయింపును రద్దు చేయడం తన రాజీనామాకు కారణం కాదంటున్నారు.
ఆ పోస్టు కోసమేనా?
త్వరలో భర్తీ అయ్యే అనేక పోస్టుల కోసం జంగా కృష్ణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీ పదవితో ఆయన సంతృప్తికరంగా లేరని తెలిసింది. రాజ్యసభ పదవి కోసం జంగా కృష్ణమూర్తి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. బీసీ కోటాలో తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని ఆయన ఇప్పటికే నాయకత్వానికి సమాచారం పంపినట్లు తెలిసింది. అందుకే ముందుగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసి ఒకరకంగా టీడీపీ నాయకత్వానికి పరోక్షంగా తన డిమాండ్ ఏంటో జంగా కృష్ణమూర్తి తెలియజేశారంటున్నారు. మొత్తం మీద జంగా కృష్ణమూర్తి టీడీపీకి రాజీనామా చేయలేదు. కేవలం టీటీడీ బోర్డు సభ్యుడిగానే రాజీనామా చేశారు. కేవలం రాజ్యసభ పదవి కోసమే ఆయన తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు అర్థమవుతుంది.
Next Story

