Fri Apr 10 2026 15:14:56 GMT+0530 (India Standard Time)
Janasena : ఈగ కూడా వాలనీయని వారు.. ఇప్పుడేందిలా?
జనసేన సోషల్ మీడియా బలహీనమైంది

జనసేన సోషల్ మీడియా బలహీనమైంది. ఒకరకంగా జనసైనికులు అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తున్నారు. 2014 నుంచి 2024 తర్వాత కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే జనసైనికులు సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్ గా కనిపించడం లేదు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై చేసే విమర్శలకు కూడా వారి నుంచి స్పందన లేదు. ఇది ప్రమాదకరమని జనసేన పార్టీ నాయకత్వం గుర్తించాలి. ఈ ఏడాదిన్నర కాలంలో తమను విస్మరించారన్న కారణంతోనే వారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడానికి ప్రధాన కారణమని పార్టీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు.
తమను పట్టించుకోవడం లేదనేనా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఎక్కువ మంది జనసైనికుల్లో ఉంది. తాము అనవసరంగా పవన్ కల్యాణ్ కు సపోర్టుగా పోస్టులు పెట్టి ప్రత్యర్థులు కావడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ పైన కానీ, ఆయన కుటుంబ సభ్యులపై ఎవరు విమర్శలు చేసినా వదలకుండా వెంటపడే వారు. పవన్ కల్యాణ్ ఒక పిలుపునిస్తే వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు. రోడ్లమీద గుంతల విషయంలోనూ గత ప్రభుత్వంలో జనసైనికులు సోషల్ మీడియాను షేక్ చేయగలిగారు.
పట్టీ పట్టనట్లు...
కానీ ఇప్పుడు పవన్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా పట్టీపట్టనట్లు ఊరుకుంటున్నారు. వైసీపీ నాయకురాలు రోజా అసలు రాజకీయాలకు సంబంధం లేని అన్నా లెజినోవా ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే వారికి కౌంటర్ ఇవ్వడానికి జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ లతో పాటు చివరకు జనసైనికులు కూడా స్పందించకపోవడం ఆ పార్టీ బలహీనత ఏంటో చెప్పకనే చెబుతుంది. జనసైనికులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని గత కొంత కాలం నుంచి నాయకత్వం గ్రహించినా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదన్నది పార్టీ నుంచి వినిపిస్తున్న మాట.
Next Story

