Mon Dec 15 2025 10:07:27 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : జనసేనలో ఈ డేంజర్ సిగ్నల్స్ ను ఎవరైనా గమనించారా?
జనసేన ఒకరకంగా సైలెన్స్ గా ఉంది. క్యాడర్ నుంచి నేతల వరకూ అందరూ నోటికి తాళం వేసుకున్నట్లే కనిపిస్తుంది

జనసేన ఒకరకంగా సైలెన్స్ గా ఉంది. క్యాడర్ నుంచి నేతల వరకూ అందరూ నోటికి తాళం వేసుకున్నట్లే కనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఇంతకు ముందు కనిపించిన జోష్ నేడు జనసేనలో కనిపించకపోవడం ప్రతి ఒక్కరూ పసిగట్టే ఉంటారు. ఎందుకంటే గత రెండేళ్ల నుంచి నామినేటెడ్ పదవుల విషయంలోనూ, నియోజకవర్గాల్లో తమను టీడీపీ నేతలు పట్టించుకోకపోవడం ఈ సైలెన్స్ కు ముఖ్యకారణమని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రత్యర్థులు చేసే విమర్శలకు కూడా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. గతంలో సోషల్ మీడియాలోనూ, వివిధ వేదికల ద్వారా పవన్ కల్యాణ్ పై ఈగవాలినా స్పందించే వారు నేడు పెదవి విప్పడానికి సిద్ధపడటం లేదు.
అధినేత పై విమర్శలను కూడా...
ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గమనించి ఉండవచ్చు. గమనించినా పట్టించుకోకపోయి ఉండవచ్చు. నిన్న కాక మొన్న కోనసీమ కొబ్బరి విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు సీరియస్ గా స్పందించినా దానిని ఖండించడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ మినహా మరొక నేత ముందుకు రాలేదు. అందులోనూ కోనసీమ నుంచి ఎవరూ ఖండించకపోవడం కూడా గమనించాల్సిన విషయం. ఇక సోషల్ మీడియాలోనూ పవన్ కు అనుకూలంగా పెద్దగా పోస్టులు కనిపించడం లేదు. గతంలో ఇరగబడి పోస్టులు పెట్టి తమ అభిమాన నేతపై మాట పడనివ్వకుండా చేసిన వారు సయితం ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చుని ఉండటం డేంజర్ సిగ్నల్స్ అని చెప్పాలి.
నోరు, చేయి కదపకుండా...
2024 ఎన్నికలకు ముందు.. తర్వాత జనసేనలో పరిస్థితులు మారిపోయాయి. పవన్ కల్యాణ్ తో పాటు ఇద్దరు మంత్రులను పక్కన పెడితే దాదాపు పద్దెనిమిది మంది శాసనసభ్యులున్నారు. ఇద్దరు ఎంపీలున్నారు. వారు కూడా నోరు మెదపడం లేదు. అలాగే కొందరు కరడు గట్టిన జనసేన క్యాడర్ గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించేవారు. కానీ రెండేళ్ల నుంచి తమను పట్టించుకోకపోవడం, తమ గోడు వినేవారు పార్టీలో లేకపోవడంతో క్యాడర్ నుంచి లీడర్ల వరకూ ఒకరకమైన నైరాశ్యం అలుము కుంది. ఇప్పటికైనా ఈ సంకేతాలను పవన్ కల్యాణ్ గమనించి ఒకింత క్యాడర్ కు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలి. అలాగే వారికి భరోసా ఇచ్చేలా వారితో సమావేశమవ్వాలి. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని జనసేన నేతలే ఆందోళన చెందుతున్నారు.
Next Story

