Fri Feb 20 2026 16:41:41 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : గుడ్ న్యూస్... జెండా మోసిన వారు ఇక బేఫికర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు. పార్టీ సభ్యత్వాల నమోదుతో జనసేన గ్రౌండ్ లెవెల్లో మరింత బలోపేతం అవుతుందని ఆయన నమ్ముతున్నారు. పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారు జనసేన విజయాలకు పనిచేస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. పల్లెలు, పట్టణాల్లో జనసేన క్యాడర్ పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జనసేన సభ్యత్వాల నమోదును ప్రారంభించారు. ఇప్పటికే జనసేనకు కార్యకర్తల బలం ఉంది. అభిమానుల బలం కూడా జనసేన సొంతం. ఇక సామాజికవర్గం అండదండలు ఎటూ ఉన్నాయి. అదనంగా క్యాడర్ ను పెంచుకునేందుకు పవన్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో...
స్థానిక సంస్థల ఎన్నికలతో జనసేన రాష్ట్రంలో బలపడాలని చూస్తుంది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే స్థానిక నాయకత్వం బలంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దీంతో పాటు జనసేనలో ఇప్పటి వరకూ పదవులు దక్కలేదని చాలా మంది నిరాశలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని ఎంపిక చేయడమే ధ్యేయంగా పనిచేయాలని, సుదీర్ఘ కాలం పార్టీలో వారి కున్న హిస్టరీని చూసి ఎంపిక చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. 2014 నుంచి పార్టీలోనే ఉంటున్న వారిని గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
ద్వితీయ శ్రేణి నేతల్లో...
జనసేన ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి ఉందని జనసేనాని కూడా గుర్తించారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినప్పటికీ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అందరికీ న్యాయం చేయలేకపోయామని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కానీ పదవి రాని వారు మాత్రం తమకు జనసేనలో గుర్తింపు లేదని బాధపడుతున్నారు. అందుకోసమే ఇకపై ఒరిజినల్ జనసైనికులకు, వీరమహిళలకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై ఏ పోస్టు భర్తీ అయినా నామినేటెడ్ పోస్టులను ద్వితీయ శ్రేణి నేతల్లో బాగా కష్టపడిన వారిని గుర్తించి, పార్టీ జెండా మోసే వారికే ప్రయారిటీ ఇచ్చేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారు. త్వరలోనే అది అమలులోకి తీసుకురానున్నారు. ఇకపై జెండా మోసిన వారికే జై కొట్టనున్నారు.
Next Story

