Fri Jan 30 2026 08:39:19 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : జనసేన అగ్రనేతల్లోనూ అసంతృప్తి.. కల్యాణ్ బాబూ వింటున్నారా?
జనసేన పార్టీలో పెద్ద స్థాయి నేతలు బయటపడుతున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు

జనసేన పార్టీలో పెద్ద స్థాయి నేతలు బయటపడుతున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కూటమిలో పదవుల పందేరంపై అసంతృప్తి వెళ్లగక్కారు. 2024 ఎన్నికలక సమయంలో కుదిరిన ఒప్పందాలను టీడీపీ నేతలు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. 2024లో కూటమిగా ఏర్పడినప్పుడు మూడు పార్టీల మధ్య పొత్తుల సందర్భంగా ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అమలు చేయాలని కోరుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లవుతున్నా దానిని అమలు చేయడం లేదని వాపోతున్నారు. జనసైనికులు, వీర మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం.
జనసైనికుల్లో అసంతృప్తి....
బొలిశెట్టి సత్యనారాయణ మాటలే కాదు. యావత్ రాష్ట్రంలోని జనసైనికులు, వీర మహిళలు ఎక్కువ మంది ఇదే అభిప్రాయంలో ఉన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా కుదరిన ఒప్పందం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట అక్కడ టీడీపీకి 60 శాతం, జనసేనకు ముప్ఫయి శాతం, బీజేపీకి 10 శాతం పదవులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు అరవై శాతం, టీడీపీకి ముప్ఫయి శాతం, బీజేపీకి పది శాతం, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీకి అరవై శాతం, జనసేనకు ముప్ఫయి శాతం, టీడీపీకి పది శాతం పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. కానీ నియోజకవర్గంలో ఈ ఒప్పందం అమలు కావడం లేదన్నది జనసైనికుల ప్రధాన ఆరోపణ.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తమకు వేలాది పోస్టులు వచ్చాయని చెబుతున్నారు. కానీ నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారంతా జనసైనికులు కాదని బొలిశెట్టి సత్యనారాయణ అంటున్నారు. టీడీపీ నేతలకే జనసేన ట్యాగ్ తగిలించి వారికి పదవులు కట్టబెట్టారని, పార్టీకి తొలి నుంచి కష్టపడుతూ పవన్ ఆశయాల కోసం పనిచేసిన వారికి మొండిచేయి మిగులుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమిస్తే అందులో ఒక్కటీ జనసేనకు దక్కలేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ లకు తెలియకుండానే స్థానిక నేతలు ఇలా చేస్తుండ ఉండవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని బహిరంగంగా కోరడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

