Thu Feb 26 2026 15:27:56 GMT+0530 (India Standard Time)
JanaSena : ఈసారి జనసేనలో కీలక మార్పులు...పవన్ గ్రీన్ సిగ్నల్
జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు

జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి, టిక్కెట్లు ఆశించిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి కొత్తగా పార్టీ కండువా కప్పుకున్న వారికే ఎక్కువ మంది సీట్లను దక్కించుకున్నారు. అయినా సరే గత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్నింటిలో గెలిచింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలను తీసుకుంటారని, ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో వారి స్థానంలో పవన్ కల్యాణ్ కొత్త వారికి అవకాశమిస్తారన్న ప్రచారం కూడా జనసేనలో జరుగుతుంది.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో రెండు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేసింది. మచిలీపట్నం, కాకినాడలో పోటీ చేయగా మచిలీపట్నంలో వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన బాలశౌరికి టిక్కెట్లు ఇచ్చారు. అలాగే అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, భీమవరం నియోజకవర్గం నుంచి పులవర్తి ఆంజనేయులు, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణలు టీడీపీ నుంచి వచ్చి జనసేనలో చేరారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ అన్ని పార్టీలు మారి చివరి నిమిషంలో పార్టీలో చేరారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, విశాఖపట్నం దక్షిణం నుంచి వంశీ కృష్ణ యాదవ్, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ లు వైసీపీ నుంచి వచ్చారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు దక్కాయన్న అసహనం, అసంతృప్తి పార్టీకి తొలి నుంచి పనిచేసిన నేతల్లో ఉంది.
ఈసారి మాత్రం...
అయితే నాడు అధికారంలోకి రావాలన్నా, జగన్ ను ఎదుర్కొనాలన్నా సరైన అభ్యర్థులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి అభ్యర్థుల ఎంపిక జరిగిందని జనసేన పార్టీ అగ్ర నాయకత్వం చెబుతుంది. అందుకే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామని, పార్టీలో ఉన్న వారా? కొత్తగా చేరిన వారా? అన్న ట్రాక్ రికార్డు చూడలేదని అంటున్నారు. అయితే ఈసారి అధికారంలోకి రావడంతో పాటు కొంత పార్టీ బలోపేతం కావడంతో జనసేనకు తొలి నుంచి పనిచేస్తున్న వారిని గుర్తించి వారికే టిక్కెట్లు ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్య నేతలకు సమాచారం అందించనున్నారని, పార్టీ కోసం పలానా నియజకవర్గాల్లో పనిచేయాలని సంకేతాలు పంపుతారని పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారికి అండగా నిలవాలని పవన్ చేస్తున్న యోచనతో జనసేన నేతల్లో కొత్త జోష్ కనిపిస్తుంది.
Next Story

