Sat Feb 14 2026 20:16:01 GMT+0530 (India Standard Time)
YSRCP : జనసేనకు జయ మంగళమే.. తెలుగుదేశానికి కర్రి కటీఫ్?
YSRCP : జనసేనకు జయ మంగళమే.. తెలుగుదేశానికి కర్రి కటీఫ్?

వైసీపీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి ఫ్యాన్ ఆన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లే కనిపిస్తుంది. కూటమిలోని పార్టీల్లో చేరిన తమకు తగిన గుర్తింపు గౌరవం, లభించడం లేదని, పదవులు కూడా దక్కడ కష్టమేనని భావించి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తొలి నాళ్లలో ఎమ్మెల్సీలు కూటమి పార్టీల్లో చేరారు. కొందరు టీడీపీ, మరికొందరు జనసేన, ఇంకొందరు బీజేపీలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు వారెవరూ సంతృప్తికరంగా లేరని తెలిసింది. వైసీపీలో తమకు లభించిన గౌరవం ఇక్కడ దక్కడంలేదని అర్థమయింది. వైసీపీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన కూటమి నేతలను శత్రువులుగానే స్థానిక నేతలు, క్యాడర్ చూస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
కాకినాడకు చెందిన...
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ 2023లో గవర్నర్ కోటాలో వైసీపీన నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే కాకినాడలో జరిగే ఏ కార్యక్రమంలోనూ ఆమెకు ప్రొటోకాల్ లభించడం లేదు. నియోజకవర్గంలో మరొక గ్రూపును పెంచడం ఇష్టం లేని నాయకత్వం కూడా పార్టీలో చేరిన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తాము పార్టీ మారి పొరపాటు చేశామా? అన్న భావన వారిలో కలుగుతుంది. వైసీపీ వాళ్లు పిలిచి పదవులు ఇస్తే అధికారం అనుభవించడం కోసం వచ్చిన వారికి తగిన శాస్తి జరిగిందని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏ పార్టీలో చేరినప్పటికీ నాయకత్వం మాత్రం పెద్దగా కొత్తగా చేరిన వారిని పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కూడా వారిని కేర్ చేయడం లేదు.
కైకలూరుకు...
ఇక కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి ఇరవై దశాబ్దాలు పనిచేశారరు. అయితే 2023 లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2024 నవంబరులో జయమంగళ వెంకటరమణకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలోనే చేరారు. జనసేనలో చేరినా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, తనకు జగన్ దేవుడని, తాను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఆయనకు తాను రుణపడి ఉన్నానని వ్యాఖ్యానించడంతో మిగిలిన వైసీపీ నుంచి వెళ్లిన వారు కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారన్నది వైసీపీ నేతల మాట. అందుకే తొందరపడి అధికారం కోసం పార్టీ మారితే అభాసుపాలు కాకతప్పదన్నది వీరి విషయంలో రుజువవుతుంది.
Next Story

