Fri Dec 05 2025 10:50:32 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ జిల్లాల పర్యటనలు షురూ... అదే లక్ష్యమా?
జనసేన పార్టీ ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో పార్టీ కార్యకర్తల సమావేశం పెడుతుంది.

జనసేన పార్టీ ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో పార్టీ కార్యకర్తల సమావేశం పెడుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే విశాఖపట్నం నుంచి ఇక కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు కూటమిపైన తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన వరసగా కార్యకర్తల సమావేశాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన తర్వాత సరైన పదవులు రాకపోవడంతో పాటు, కూటమిలోని ఇతర పార్టీల నేతల నుంచి సహకారం అందడం లేదని కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు...
ఈ సమయంలో క్యాడర్ లో జోష్ నింపేందుకు పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలు పెట్టుకున్నట్లు తెలిసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ కార్యకర్తలను ముందుగా ప్రిపేర్ చేయడానికి ఈ కార్యక్రమం భుజానకెత్తుకున్నట్లు తెలిసింది. ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారికి సరైన భరోసా ఇవ్వడంతో పాటు భవిష్యత్ లో తన ప్రణాళిక ఏంటన్నది కూడా పవన్ వివరించే అవకాశముందని తెలుస్తుంది. దీనివల్ల పార్టీకి, క్యాడర్ కు మధ్య ఉన్న గ్యాప్ తొలిగిపోతుందని ఆయన భావిస్తున్నారు.
ఎందుకు సర్దుకుపోతున్నానని...
నిజానికి వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి జిల్లాల పర్యటనను సెప్టంబరు నుంచి చేస్తానని ఇటీవల మీడియాకు తెలిపారు. అందులో భాగంగానే ఈ నెలాఖరులోనే ఆయన విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఇప్పటికే సర్దుకుపోతున్నారన్న అభిప్రాయం కలిగింది. అయితే తాను ఎందుకు సర్దుకుపోతున్నానో కార్యకర్తలకు వివరించే అవకాశముంది. అలాగే జిల్లాలో టీడీపీ నేతలు సహరించకపోతే పార్టీ నాయకత్వానికి తెలియచేయడానికి ఒక నాయకుడిని కూడా నియమించే ఆలోచనను పవన్ కల్యాణ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటన విశాఖ తో ప్రారంభమయినట్లేనని అంటున్నారు.
Next Story

