Fri Dec 05 2025 13:38:09 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ మనసు మారిందా.. ఆ పదవి కోసం మరో పేరు పరిశీలిస్తున్నారా?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇద్దరు ఎంపీలున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. అయితే ఆయన రాజ్యసభ పదవిలో మాత్రం ఎవరూ లేరు. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ పోస్టుల్లో జనసేనకు ఒక పోస్టును కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముందు తన ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. తద్వారా రాష్ట్ర, కేంద్ర ఉభయ సభల్లోనూ జనసేనకు ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. త్వరలో కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
వచ్చే ఏడాది నలుగురు...
వచ్చే ఏడాది నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీకి చెందిన పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, టీడీపీకి చెందిన సానా సతీష్ బాబులు 2026 జూన్ 21న పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో ఏడాదిలో నాలుగు రాజ్యసభ సభ్యుల పదవులు ఖాళీ కానున్నాయి. ఇందులో టీడీపీకి చెందిన సానా సతీష్ బాబుకు తిరిగి రాజ్యసభ పదవి దక్కే అవకాశముంది. వైసీపీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఒక్క పోస్టు కూడా రాదు. దీంతో మిగిలిన మూడింటిలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
లింగమనేనికి అనుకున్నా...
నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నా అందులో టీడీపీది ఒకటి ఉండటంతో దానిని వదిలేయగా మిగిలిన మూడింటిలో ఒకటి తమకు ఇవ్వాలని ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంలో అమిత్ షా చెప్పినట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాతనే పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీకి ఒకటి కేటాయించాలని కోరడంతో మొత్తం ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో రెండింటిలో టీడీపీ, బీజేపీ, జనసేన చెరి ఒకటి స్థానాలను తీసుకోవాలన్న ఒప్పందం దాదాపు ఖరారయినట్లు తెలిసింది. అయితే మొన్నటి వరకూ జనసేన నుంచి లింగమనేని రమేష్ అనే ప్రచారం నడిచింది. అయితే లింగమనేని రమేష్ కు టీడీపీ నుంచి ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది.
మరొక వ్యక్తికి...
తమ పార్టీ నుంచి మరొకరిని రాజ్యసభకు పంపుతామని పవన్ కల్యాణ్ చెప్పినట్లు తెలిసింది. లింగమనేని రమేష్ పేరును జనసేన నుంచి పంపినా జనాలు మాత్రం అతనిని తెలుగుదేశం అభ్యర్థిగానే భావిస్తారని, అందుకే తమ పార్టీకి చెందిన వారికే ఇవ్వాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా నుంచి బలమైన నేతను రాజ్యసభకు ఎంపిక చేయాలని కూడా పవన్ కల్యాణ్ ప్రాధమికంగా నిర్ణయించారని తెలిసింది. అయితే మరొక ఆలోచన కూడా చేస్తున్నారట. నాగబాబును రాజ్యసభకు పంపి, ఎమ్మెల్సీ స్థానాన్ని మరొకరికి అప్పగించే యోచనలో కూడా జనసేనాని ఉన్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

