Tue Jul 08 2025 17:28:45 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ కు ఆ మాత్రం తీరిక లేదా? జనసేనలో హాట్ టాపిక్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏడాది గడుస్తున్నా ఇంత వరకూ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాలేదు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏడాది గడుస్తున్నా ఇంత వరకూ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాలేదు. జనసేన ఆవిర్భావ సభలో వారిని వేదికపై కలవడమే తప్పించి అడపా దడపా అప్పుడప్పుడు వేర్వేరుగా కలుస్తున్నారు తప్పించి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై కూడా ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జనసేనలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు వరసగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతూ వారికి కార్యక్రమాలను ఇస్తూ క్షేత్రస్థాయిలో యాక్టివ్ చేస్తుంటే పవన్ కల్యాణ్ మాత్రం ఆ పనికి పూనుకోకపోవడాన్ని కొందరు నేతలే ప్రశ్నిస్తున్నారు.
హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో...
2024 లో జరిగిన ఎన్నికల్లో జనసేన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించింది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జులతో జనసేన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వారి మాటలను అధికారులు కూడా వినడం లేదన్న వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న నామినేటెడ్ పదవులను కూడా తమ ప్రమేయం లేకుండా టీడీపీ నేతలు భర్తీ చేసుకుంటున్నారని కొందరు నేరుగానే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకుని వాటిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత పవన్ కల్యాణ్ పైనే ఉంది.
నిత్యం బిజీగానే...
కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిత్యం బిజీగానే ఉంటున్నారు. తాను ఒక పార్టీ చీఫ్ అన్న విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యేలతో టచ్ మి నాట్ గా వ్యవహరిస్తే జరుగుతున్న విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. కేవలం కొందరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తోనే జనసేనాని ముందుకు వెళితే భవిష్యత్ లో రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మూడు గంటల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే తీరిక లేని పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలు ఏం చేస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని కోరుతున్నారు.
Next Story