Fri Dec 05 2025 22:48:08 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ పట్టించుకోవడం లేదని గుస్సా అవుతున్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే పదవిలో కుదురుకుంటున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే పదవిలో కుదురుకుంటున్నారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది. గత కొన్ని నెలల నుంచి ఆయన తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ శాఖను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకూ భారీ మార్పులు చేసి, బదిలీలు చేసి కొంత మంచి అధికారులను నియమించారు. ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత, మెరుగైన సేవలు చేయాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అడిగి తీసుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయన ప్రతి అడుగులో కనిపిస్తుంది.
ఏరికోరి తీసుకున్న...
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు న్యాయం చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్నారు. ఆయన మరేదీపెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం లడ్డూ వివాదంపై తలదూర్చడం మినహా మిగిలిన రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అలాగే నిధుల కోసం ఢిల్లీకి పరుగులు తీయడం, కేంద్ర మంత్రులను కలవడం వంటి వాటికి దూరంగా ఉన్నారు. హంగూ ఆర్భాటాలను ప్రదర్శించడం లేదు. కేవలం తన కార్యాలయం, పార్టీ ఆఫీసు అంత వరకే పవన్ కల్యాణ్ పరిమితమయ్యారు. ఆ ఒక్కటీ తప్ప మరే ఆలోచనను ఆయన చేయడం లేదు. ఆయన లక్ష్యం ఒక్కటే. తాను తీసుకున్న శాఖకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలన్నదే.
కాపు సామాజికవర్గంలో...
కానీ ఇది కొంత క్యాడర్‌కు, ఆయన పార్టీ జనసేన, కూటమి పార్టీ గెలుపునకు అద్ధుతమైన విజయాన్ని అందించడంలో కీలకమైన కాపు సామాజికవర్గంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తుంది. అసహనమూ బయలుదేరిందంటున్నారు.ఆయన వద్దకు వెళ్లిన కొందరు మాత్రమే వ్యక్తిగతంగా ప్రయోజనం, లబ్ది పొందుతున్నా రు కానీ, కాపు సామాజికవర్గం గురించి పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం అందించిన కాపు సామాజికవర్గానికి ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తారని పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాపులు. ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు.
ఎనిమిది నెలలు దాటుతున్నా...
అయితే కాపు సామాజికవర్గం నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా ఎవరూ బయటపడలేదు. అందరూ మౌనంగానే ఉన్నారు. ఎనిమిది నెలలయినా తమ గురించి, తమ కమ్యునిటీ గురించి పట్టించుకోవడం లేదన్న కొంత అసంతృప్తి అయితే ఉభయగోదావరి జిల్లాల్లో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఆ జిల్లాలపై కూడా ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టింది లేదు. పర్యటించింది కూడా తక్కువే. మంత్రి వర్గ సమావేశాల్లోనూ తమ కమ్యునిటీ ప్రయోజనాల గురించి ప్రస్తావించిన సందర్భం లేకపోవడం వారిని ఒకరకంగా ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతానికి వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ, కొద్దికాలమైన తర్వాత అయినా తమను గురించి పట్టించుకుంటారన్న ఆశతో ఉన్నారు. మరి పవన్ ఏం చేస్తారో అన్నది వేచిచూడాల్సిందే.
Next Story

