Tue Jul 08 2025 17:38:10 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : ఏపీ ప్రజలకు ముందే వచ్చిన పండగలు... సంక్రాంతి, దీపావళి ఒకేరోజు జరుపుకోవాలా?
జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ అంతటా దీపావళి, సంక్రాంతి పండగ జరుపుకోవాలని జనసేన పిలుపు నిచ్చింది.

సినిమా స్క్రిప్ట్ కాదు.. వాస్తవ పరిస్థితులు చూడాలి. పండగ చేస్కోండి ఇక ఒక పిలుపు ఇచ్చినంత మాత్రాన ఎవరు చేసుకుంటారు? జగన్ పాలన పీడ విరగడయి ఏడాది కావస్తుందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయి సంవత్సరం పూర్తి కావస్తున్నందున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటా సంక్రాంతి, దీపావళి ఒకే రోజు జరుపుకోవాలని జనసేన పిలుపు నివ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ ఇంకా రాసిచ్చిన స్క్రిప్ట్ ను వల్లె వేస్తున్నారు తప్పించి క్షేత్రస్థాయిలో పిఠాపురంలో జనం ఏమనుకుంటున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ ఈ నెల నాలుగో తేదీన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందున వెన్నుపోటు దినంగా పాటించాలని తమ కార్యకర్తలకు పిలుపు నిచ్చింది.
వైసీపీ వెన్నుపోటు దినానికి వ్యతిరేకంగా...
అయితే వైసీపీ వెన్నుపోటు దినానికి ప్రతిగా జనసేన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆ రోజు పండగ చేసుకోవాలని పిలుపు నివ్వడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడాది సుపరిపాలనను అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండగ చేసుకోవాలని కోరింది. సంబరాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. పీడ విరగడై ఏడాది అన్నంత వరకూ ఓకే కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు పండగ చేసుకునేంత పరిస్థితులు ఏమున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఉదయం వేళ ప్రతి ఇళ్ల ముంగిట ముగ్గులు వయడం, ముగ్గుల పోటీలను నిర్వహించడంతో పాటు సాయంత్రం వేళ దీపాలు వెలిగించి టపాకాయాలు కాల్చడం ఏంటని పలువురు పవన్ కల్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
ఎందుకు చేసుకోవాలంటూ?
ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పర్చనందుకు పండగ చేసుకోవాలా? రాజధాని అమరావతికి వేల కోట్ల నిధులు కేటాయించి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చేతులెత్తేసినందుకు చప్పట్లు కొట్లాలా? ఏడాది గడిచినా కనీసం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అందించనందుకు ఇంటి ముందు ముగ్గులు వేసి చిందులు తొక్కాలా? మహిళలకు ఉచిత బస్సు అంటూ ఊరిస్తూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నందుకు టపాకాయాలు పేల్చాలా? అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అనేక నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నా పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నందుకు దీపాలు వెలిగించాలా? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏదో చేస్తారనుకుంటే?
ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఏదో చేస్తారని అనుకుంటే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నందుకు ముగ్గుల పోటీలు నిర్వహించాలా? అని నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ చెప్పిన మాటలు గుర్తు చేయడానికి ఆయన వీడియోలు పోస్టులు చేయడానికి కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెడీ అవుతున్నారు. సుగాలీ ప్రీతి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నా మౌనంగా ఉన్న మీ అంగీకారనికి డిజిటిల్ క్యాంపెయిన్ చేయాలా? అని నిలదీస్తున్నారు. రేషన్ దుకాణాలు ప్రారంభించి పండగ చేసుకోవాలంటారా? ఇంతకంటే అద్భుతమైన పథకం మరేదీ లేదంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నాలుగో తేదీన ఇటు జనసేన, అటు వైసీపీ ఇద్దరూ వివిధ కార్యక్రమాలకు పిలుపు నివ్వడంతో రెండు పార్టీల నేతల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జనసేన పిలుపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Next Story