Fri Dec 05 2025 13:41:59 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : పవన్ ముఖ్యమంత్రి అయ్యే సమయం ఎంతో దూరం లేదా? ఆలోచన అదేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో జనసేను గెలిపించాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారు. పవన్ కల్యాణ్ అందుకే ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. కొన్ని కీలక విషయాల్లో మాత్రమే పవన్ స్పందిస్తున్నారు. అంతే తప్పించి ఆయన పాలన వ్యవహారాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రశ్నించడం లేదు. పవన్ తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు గెలవాలంటే ఇటు టీడీపీ సహకారం అవసరం. అదే సమయంలో కాపు సామాజికవర్గం మద్దతు కూడా అంతే అవసరం. అభిమానులు ఎటూ వెళ్లరు. ఆ నమ్మకంతోనే పవన్ కల్యాణ్ ఉన్నారు. మరొకవైపు ఎక్కడికి వెళ్లినా సీఎం..సీఎం అంటూ అభిమానులు చేస్తున్న నినాదాలు నిజం చేయాలనుకుంటున్నారు.
వ్యతిరేకత తమపై పడకుండా...
టీడీపీ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తన పార్టీపై పడకూడదని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే పెద్దగా హడావిడి చేయడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్రంలో జరిగే పరిణామాలకు తనకు సంబంధం లేనట్లే పవన్ కల్యాణ్ వ్యవహరించడం కూడా అదే కారణమని అంటున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం అదే రీజన్ అని చెబుతున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా వెలువడే వ్యతిరేకత భాగస్వామి పార్టీగా తమపై పడకూడదనే పవన్ కల్యాణ్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శాఖలకే పరిమితమయి...
అదే సమయంలో తాను మాత్రం తనకు అప్పగించిన శాఖల విషయంలో మార్పులు చేసి చూపించి, ప్రజాభిమానాన్ని చూరగొనాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు నియోజకవర్గాలతో పాటు మరో పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో జగన్ కు అధిక స్థానాలు వచ్చినా తాము కీలకంగా మారి ముఖ్యమంత్రి పదవి కూడా దక్కే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఉన్నారు. అది బయటకు చెప్పకపోయినప్పటికీ జగన్ గట్టిపోటీ ఇచ్చి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తే అప్పుడు సీఎం పదవి కొన్నాళ్ల పాటయినా తనను వెతుక్కుంటూ వస్తుందని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆ స్ట్రాటజీతోనే వెళుతున్నారు.
కాపు సామాజికవర్గం కూడా...
చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని తాను కోరడం వెనక కూడా టీడీపీ ఓటు బ్యాంకు మళ్లకుండా ఉండేందుకేనంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ కాపు సామాజికవర్గానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా సంక్షేమ విషయాల్లో కాపులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎన్నికలకు ముందు చివరి రెండు సంవత్సరాలు గట్టిగా చంద్రబాబు పై వత్తిడి తెచ్చి అమలు చేయగలిగితే ఆ ఓటు బ్యాంకు కూడా ఎక్కడికీ పోకుండా, తనను అంటిపెట్టుకునే ఉంటుందని నమ్ముతున్నారు. ఇప్పటి వరకూ కాపు సామాజికవర్గానికి చేసిందేమీ లేదన్న అసంతృప్తి వారిలో ఉందని, ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అధికి సీట్లు గెలవాలంటే చివరి ఏడాది దానిపై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద పవన్ కల్యాణ్ ఆలోచనలు నిజమమైతే వచ్చే ఎన్నికల ఫలితాలు ఆయనను ముఖ్యమంత్రి గా చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story

