Sun Mar 22 2026 03:23:27 GMT+0530 (India Standard Time)
ఈ గర్జనలేంటి.. ఈ కూతలేంటి?
విశాఖ గర్జనకు ముందే తాము ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు

విశాఖ గర్జనకు ముందే తాము ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తమ పార్టీ అంతర్గత విషయాలు వైసీపీకి ఎందుకు చెబుతామని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట చెప్పకూడదన్నారు. ఒక పార్టీ కార్యక్రమం పెట్టుకుంటే దానికి ఎదురెళ్లడం తనకు ఎంత మాత్రం ఇష్టముండదన్నారు. అధికారంలో ఉండి ఈ గర్జనలేంటి? ఈ కూతలేంటి? అని పవన్ ప్రశ్నించారు. అధికారానికి దూరంగా ఉన్నప్పుడు గర్జించాలని అభిప్రాయపడ్డారు. ఓసారి తమిళనాడు, మరోసారి తమిళనాడు మనల్ని తరిమేశాయన్నారు.
జైలులో కూడా...
జైలులో కూడా జైలర్ బెల్ట్ తో కొడుతున్నారని తమకు తెలిసిందన్నారు. తమ కార్యకర్తలు అరెస్టయి జైలుకు వెళితే వైసీపీకి అనుకూలంగా ఉన్న జైలరు ఒకరు మోకాళ్ల మీద కూర్చోబెట్టి కొట్టారన్నారు. తనను రెచ్చగొట్టాలని చూశారన్నారు. కానీ తాను చాలా సంయమనంతో ఉన్నానని అన్నారు. నోరు జారే ప్రతి వైసీపీ నాయకుడిపై తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. కేసులకు భయపడాల్సిన పనిలేదని అన్నారు. విశాఖ అంశంలో అరెస్ట్ అయిన వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జనసైనికులు బలమైన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మరింత బలంగా గొంతు విప్పుతామని ఆయన తెలిపారు.
Next Story

