Tue Apr 07 2026 05:24:40 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : జమిలి ఎన్నికలు...తధ్యమా... అయితే ఎవరికి లాభం?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జమిలి ఎన్నికలు వస్తాయని, తెలంగాణ ఎన్నికలు 2029 లో జరుగుతాయని తెలిపారు. జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనుంది. తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2029కి ఆరేళ్లవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అంటే తిరిగి 2029లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి ఎన్నికలు ఒక ఏడాది ముందుగా వస్తాయని వైసీపీ తొలుత భావించింది. కానీ ఫ్యాన్ పార్టీ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.
ఇప్పటికే రాజకీయాలు...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. తొలి నుంచి రాజకీయ వాతావరణం వేడి వేడిగానే కొనసాగుతుంది. జగన్ కు కూడా జమిలి ఎన్నికల సమాచారం తెలియడంతోనే ఏడాదిన్నర తర్వాత మాత్రమే పాదయాత్ర చేయాలని నిర్ణయించారంటున్నారు. 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి 2027లో ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. తొలుత 2028 నాటికి జమిలి ఎన్నికలు వస్తాయని భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2029 కే దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో ఏపీలో మరో మూడేళ్లకు కాని ఎన్నికలు జరగవు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశాం కాబట్టి, మిగిలిన హామీలను కూడా నెరవేర్చి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తుంది.
రెండు పార్టీల నినాదాలతో...
అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తే ప్రజలు కూటమికి మరోసారి పట్టం కడతారని అంటున్నారు. గుజరాత్ తరహాలో వరసగా అధికారం ఇస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నినాదంతో కూటమి ఈసారి ఎన్నికలకు సిద్ధమవుతుంది. వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వంలో అవినీతి, సంక్షేమ పథకాలు అందరికీ చేరకపోవడంతో పాటు కక్ష పూరిత రాజకీయాలు, అక్రమ కేసులు వంటివి నినాదాలుగా వెళ్లాలనుకుంటుంది. కాంగ్రెస్ కు, కమ్యునిస్టులకు ఈసారి కూడా అవకాశం ఉండదు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి, వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నది వాస్తవం. జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో పెద్దగా తేడా ఉండదు. ఏపీలో ఎప్పటి నుంచో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఒక ఏడాది ముందు శాసనసభ, తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికల వల్ల ఏపీకి నష్టం లేదు. లాభం లేదు. మళ్లీ గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీ గెలిచేందుకు సర్వశక్తుల ఒడ్డుతుంది.
Next Story

