Fri Dec 05 2025 09:01:13 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు కష్టాలు చుట్టుముడుతున్నట్లేనా? సంకేతాలు అవేనా?
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చుట్టూ చక్రబంధం బిగుసుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు. అనేక విషయాలు జగన్ కు రానున్న కాలంలో కష్టాలు తప్పేట్లు లేదని సంకేతాలు కనిపిస్తున్నాయి.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చుట్టూ చక్రబంధం బిగుసుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు. అనేక విషయాలు జగన్ కు రానున్న కాలంలో కష్టాలు తప్పేట్లు లేదని సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ పై కేంద్ర ప్రభుత్వం వైఖరి మారినట్లు కనపడుతుందంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొంత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే జగన్ కు కష్టాలు చుట్టుముడుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు ఇందుకు కారణమని వైసీపీలోని చాలా మంది నేతలు భావిస్తున్నారు. జగన్ చుట్టూ చక్రబంధం వేస్తున్నట్లే కనిపిస్తుంని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
సానుభూతి దక్కకుండా...
చంద్రబాబు నాయుడు పక్కా పొలిటికల్ లీడర్. తాను జగన్ పై ఏదో కేసులు పెట్టి జైలుకు పంపితే అది సానుభూతిగా మారి జగన్ కు వరంగా మారుతుంది. రాజకీయంగా నష్టం జరిగేది టీడీపీకే. అందుకే ఈసారి ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపైన పెట్టినట్లు కనిపిస్తుంది. దానివల్ల సానుభూతి గ్రాఫ్ చాలా వరకూ తగ్గించే వీలుందన్నది చంద్రబాబు అంచనా. గతంలో తనను 52 రోజుల పాటు జైలులో వేయడంతోనే ఈసారి టీడీపీకి అంత గా ప్రజలు పట్టం కట్టారు. అదే పద్ధతిలో తాను వెళితే.. అదే సానుభూతి జగన్ కు చేరుతుందని అంచనా వేసిన పెద్దాయన ఇప్పటి వరకూ ఎలాంటి కేసుల విషయంలో దూకుడు ప్రదర్శించలేదు. తన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈవిషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ చంద్రబాబు దూరాలోచనతో దానిని పట్టించుకోనట్లు వదిలేస్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీతో...
ఇక తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తిరిగి దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమని సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పడాన్ని కూడా కొందరు ఉదహరిస్తున్నారు. 2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే అందులో ఎవరి ప్రమేయం ఉందన్నది ఇంత వరకూ తేలలేదు. సీబీఐ ఒక దశలో తాము దర్యాప్తు పూర్తి చేశామని చెప్పేసింది. కానీ చివరకు సీబీఐ తాము విచారణ చేపట్టడానికి సిద్ధమని చెప్పడం బట్టి చూస్తుంటే జగన్ కు కొన్ని చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలే జగన్ చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లూ హస్తినతో మంచి సంబంధ బాంధవ్యాలు మెయిన్ టెయిన్ చేసిన జగన్ కు ఈసారి మాత్రం ఆసరా దొరికే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ చక్రబంధం నుంచి జగన్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.
Next Story

