Tue Feb 03 2026 10:39:19 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ నాన్ సీరియస్ పొలిటీషయన్ గా మారుతున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. నాటి ప్రతిపక్షం ధీటుగా చేసే విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాను బటన్ నొక్కుతూ డబ్బులు పంచుతుంటే ఓట్లు పడతాయని భ్రమించారు కానీ, నాటి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. అదే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ దారుణ ఓటమికి కారణమయింది. అధికారం కోల్పోయినప్పటికీ జగన్ లో ఇసుమంత మార్పు రాలేదు. అదే పంథాను అనుసరిస్తుండం పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు చేసే విమర్శలు ప్రజల్లోకి వెళితే జరిగే నష్టాన్ని కూడా జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు. ఇప్పటికీ పార్టీ తన వల్లనే గెలవాలన్న సంకేతాలను పంపానుకుంటున్నారని, సమిష్టి ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ నోరు మెదపలేదు. దానిపై కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఆరోపణలకు కూడా జగన్ మౌనంగానే ఉండటంతో ప్రజలు విమర్శలను నిజం అని ఖచ్చితంగా అనుకుంటారన్న ధ్యాస నాడు కరువయింది. వివేకా హత్య 2019 ఎన్నికల్లో ఎంత జగన్ పార్టీకి లబ్ది చేకూర్చిందో.. అంతే నష్టం 2024 లో చేసిందన్నది వాస్తవం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదంలోనూ అంతే. గత ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది.మీ భూములు జగన్ లాగేసుకుంటాడు అంటూ సాగిన ఈ ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లపై ప్రభావం చూపింది. కానీ ఆ యాక్ట్ ను సక్రమంగా జనంలోకి తీసుకెళ్లడంలో జగన్ విఫలమయ్యారు.
మధ్యలోనే వదిలేస్తూ...
ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంతో పాటు తిరుమల లడ్డూ వ్యవహారం పై కూడా జగన్ నాన్ సీరియస్ గానే తీసుకున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అంతదాకా ఎందుకు.. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను కొద్ది రోజులు నడిపి తర్వాత వాటిని వదిలేయడాన్ని కూడా నేతలు గుర్తు చేస్తున్నారు. గీతం యూనివర్సిటీకి భూముల కేటాయింపు విషయంలోనూ జగన్ పెద్దగా పట్టించుకోకపోవడం జగన్ ఉదాసీన వైఖరికి నిదర్శనమంటున్నారు. ఇలాగే ఉంటే మరికొన్నేళ్లయినా ప్రజల్లోకి పాజిటివ్ ఆలోచనలు పార్టీ పట్ల రావన్నది వాస్తవం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని అనుకోవడం కూడా భ్రమే అవుతుంది. అందుకే జగన్ ఇప్పటికైనా ఏ విషయాన్నైనా ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని, అందుకు పార్టీ యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి.
Next Story

