Sat Dec 13 2025 19:30:29 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : జగన్.. జేసీ కుటుంబం ఒక్కటి కానున్నదా?
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వారసుడిగా మొన్నటి ఎన్నికల్లో రాజకీయాల్లో రావాలని భావిస్తే టీడీపీ టిక్కెట్ కేటాయించలేదు. ఒక కుటుంబంలో ఒకరికే టిక్కెట్ అన్న సూత్రంతో జేసీ పవన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వని టీడీపీ నాయకత్వం జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ అనేది టీడీపీ అనుసరిస్తే తాడిపత్రి మాత్రమే జేసీ కుటుంబానికి దక్కుతుంది. అనంతపురం పార్లమెంటు మళ్లీ కూడా దక్కదు.
అనంతపురం పార్లమెంటు సీటును...
అందుకే జేసీ పవన్ రెడ్డి వైసీపీకి దగ్గరవుతున్నారని తెలిసింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పటికీ జేసీ కుటుంబానికి పట్టు ఉంది. అయితే తన తండ్రి సోదరుడు కుమారుడు టీడీపీలో ఉండటం, తాను వైసీపీ లోకి వెళితే ఏ మేరకు కలసి వస్తుందన్న దానిపై ఇంకా తర్జన భర్జన పడుతున్నారని తెలిసింది. జేసీ పవన్ రెడ్డికి ఒక "మెగా" కాంట్రాక్టరు సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా వైసీపీ టిక్కెట్ ను పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజానికి మరొకరి సిఫార్సు పవన్ రెడ్డికి పనిలేదు. వైసీపీ అధినేత జగన్ తో సత్సంబంధాలున్నాయి. ఇద్దరూ మంచిమిత్రులేనని అందరూ చెబుతారు. ఎన్నో ఏళ్ల నుంచి వీరి మధ్య మంచి రిలేషన్ నడుస్తుంది.
ఇంకా చర్చల దశలోనే...
అందుకే వచ్చే ఎన్నికలకు ముందే పవన్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశముందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. టీడీపీలో ఉంటే తమలో ఒక్కరికి మాత్రమే టిక్కెట్ దక్కుతుందని, అందుకని వేర్వేరు పార్టీల్లో ఉండటం మంచిదని భావిస్తున్నారు. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో మాదిరిగా జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండటానికి ఇదే కారణమని చెబుతున్నారు. అయితే దీనిపై జగన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది. జేసీ పవన్ రెడ్డి పట్ల జగన్ కు సానుకూలత ఉన్నప్పటికీ జేసీ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే జిల్లాలోనే కాకుండా సీమ జిల్లాల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ట్రయల్స్ అయితే మాత్రం జరుగుతున్నాయని సమాచారం. చివరకు జగన్ జేసీ పవన్ రెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Next Story

