Wed Dec 10 2025 09:52:26 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ మాస్టర్ ప్లాన్... ఈసారి వర్క్ అవుట్ అవుతుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన జనవరి నెల సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక బెంగళూరుకు బైబై చెప్పి 2026 నుంచి ఇక విజయవాడలోని తాడేపల్లి నివాసంలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన చేపట్టాలని తొలుత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రోజుకు రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించాలని జగన్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. దీనివల్ల జిల్లా నేతలతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఇక యాక్టివ్ అయ్యే అవకాశముందని భావించి తొలుత జిల్లాల టూర్ ను దాదాపు ఆరు నెలల పాటు విడతల వారీగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కార్యకర్తలతో సమావేశం...
జగన్ జిల్లాల పర్యటనల్లో ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు అక్కడ నియోజకవర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొనేలా రోడ్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కార్యకర్తల సమాశాన్ని ఒకరోజంతా కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే కాకుండా వారితో ఒకరోజు గడిపి తాను ఉన్నానన్న ధైర్యాన్ని నింపాలన్న ప్రయత్నంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఈలోపు జిల్లాల పర్యటనలు చేసి క్యాడర్ ను ఉత్తేజ పర్చాలని జగన్ భావిస్తున్నారు.
నియోజకవర్గాల ఇన్ ఛార్జుల నియామకంతో...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో జగన్ ఇక కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఇప్పటికే నియోజకవవర్గాల నేతలకు కూడా సమాచారం అందించారని తెలిసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ ఛార్జులను మార్చిన జగన్ త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయి నియామకాలు చేపట్టడమే కాకుండా బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు ఎంత వరకూ వచ్చిందన్న దానిపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. కొత్త ఏడాది నుంచి జగన్ నయా ప్లాన్ తో జనం ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ కేసులకు భయపడి బయటకు రాని నేతలు కూడా ఇక బయటకు వస్తారని పార్టీ నాయకత్వం భావిస్తుంది. రాకపోతే ప్రత్యామ్నాయ నేతలను నియమించడానికి తగిన సమయం కూడా తమకు ఉంటుందని అంటున్నారు.
Next Story

