Fri Dec 05 2025 13:29:56 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జగన్ కీలక నిర్ణయం.. ఆ ఎన్నికలు ఊపు తెస్తాయని
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని, నేతలు కూడా గ్రామ, పట్టణ స్థాయిలో డీలా పడే అవకాశముందని జగన్ భావిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీకి దిగితే ఖచ్చితంగా పార్టీ ఎదుగుదలకు అది కారణమవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకే ఇటీవల జరిగిన నేతల సమావేశంలో బూత్ లెవెల్ కమిటీలు వేయాలని జగన్ ఆదేశించారు. బూత్ లెవెల్ కమిటీల నుంచి పార్టీని బలోపేతం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలోనే జగన్ ఉన్నారని తెలిసింది.
ఓటమికి భయపడి...
పులివెందుల ఎంపీటీసీ ఉప ఎన్నిక చూసిన తర్వాత కొందరు నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ ఎదుట ప్రతిపాదన పెట్టారు. అయితే జగన్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఓటమికి భయపడి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కార్యకర్తల్లోనూ, గ్రామీణ నాయకత్వంలోనూ అసహనం ఏర్పడుతుందని జగన్ అంచనా వేశారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయడం వల్ల రెండు ఉపయోగాలుంటాయని జగన్ అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది. రెండు గ్రామ స్థాయిలో అధికార, విపక్ష వర్గాలుగా విడిపోయి వచ్చే ఎన్నికలకు తమకు అడ్వాంటేజీగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు.
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం...
ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడాల్సిందేనని జగన్ నేతలకు ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పారని తెలిసింది. నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా తమ ప్రాంత పరిధిలోని పార్టీకి నమ్మకమైన నేతలకు, కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అసలు పార్టీ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో అంచనా వేసుకోవడానికి కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపు జిల్లా, నియోజకవర్గ, బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో ఉండాలని నేతలకు జగన్ ఆదేశించారట. ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా వెంటనే దానికి స్పందన భారీగా వచ్చే అవకాశముందన్న అంచనాల్లో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు.
Next Story

