Fri Feb 14 2025 12:42:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగనన్న మాటలను నేతలు నమ్మడం లేదా? ఇదే ఉదాహరణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటలను నేతలు విశ్వసించడం లేదన్నది స్పష్టంగా అర్ధమవుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటలను నేతలు విశ్వసించడం లేదన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్ మాటలను అసలు లీడర్లు లెక్క చేయడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల తీరు చూస్తే అర్థం కావడం లేదూ.. ఎందుకంటే జగన్ పార్టీ నేతలను పూర్తిగా వదిలేసినట్లే కనపడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఏ ఎన్నికలోనూ వైసీపీ తన పట్టును నిలుపుకోలేకపోయింది. దీనికి కారణం ఎవరు? కార్పొరేటర్లు, వార్డు సభ్యులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నా స్థానిక నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. తిరుపతి కార్పొరేషన్ మినహా అన్నిచోట్ల వైసీపీ నేతలు చేతులు ఎత్తేశారు.
జిల్లాల నేతలతో సమావేశాలు...
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు అన్ని జిల్లాల నేతలో తాడేపల్లి కార్యాలయంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చేజారిపోకుండా ఉండేందుకు ఈ సమావేశాలను జగన్ ఏర్పాటు చేశారు. కడప జిల్లా పరిషత్ దగ్గర నుంచి నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశాలకు మున్సిపల్ ఛైర్మన్ల నుంచి ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యారు. జిల్లాల్లో ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చి జగన్ ముందు జీ హుజూర్ అన్నారు.
మళ్లీ మన ప్రభుత్వం వస్తుందంటూ...
అయితే జగన్ చెప్పిన మాటలు ఏంటంటే.. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు పార్టీకి అండగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అంటే పార్టీలో కొనసాగాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దంటూ పరోక్షంగా నేతలకు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని, నాలుగేళ్ల తర్వాత కానీ, 2027లో జమిలీ ఎన్నికలు జరిగినా గెలుప తమదేనని పదే పదే చెబుతున్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో మరోసారి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, అసంతృప్తి అధికార పార్టీపై పెరిగిందని, అందుకే ఎవరూ పార్టీని వీడివెళ్లవద్దంటూ జగన్ పదే పదే చెప్పుకుంటూ నేతలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
స్థానిక నేతలు పట్టించుకోక...
కానీ వైఎస్ జగన్ జిల్లా నేతల సమావేశంలో చేసిన హితబోధ వారి చెవికి ఎక్కినట్లు కనిపించలేదు. నేతలు పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. అధికార పార్టీ నుంచి సహజంగా ప్రలోభాలు వస్తాయి. కానీ అదే రీతిలో స్థానిక నేతలు కార్పొరేటర్లను కానీ, వార్డు సభ్యులకు గానీ ఆర్థికంగా ఏదో రకమైన హామీ ఇవ్వగలిగితే అన్ని స్థానాలను ఇలా కోల్పోయేవాళ్లం కామని క్యాడర్ అంటుంది. గత ఐదేళ్లలో ఆర్థికంగా సంపాదించుకున్న వారు కూడా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖర్చు చేయడానికి ముందుకు రాకపోవడంతోనే అన్నిచోట్ల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారంటున్నారు. అంటే జగన్ చెప్పిన మాటలు నేతలు చెవికెక్కలేదనడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉదాహరణలుగా కనిపించడం లేదా? అని వైసీపీ క్యాడర్ నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Next Story