Fri Dec 05 2025 23:19:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : లడ్డూ ఏమయింది గోవిందా.. తొక్కిసలాట.. విషయం వైకుంఠా?
తిరుమలలో జరిగిన ఘటనలపై విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు

తిరుమలలో జరిగిన ఘటనలపై విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ ఈ ఘటనలపై ఎలాంటి ముందడుగు పడటం లేదు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక భక్తి భావంతో కూడిన విశ్వాసం. ఏడుకొండల వాడిని తమఇలవేల్పుగా భావించి దేశం నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు చేరుకుని ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు. రోజుకు అరవై నుంచి డెబ్బయి వేల మంది భక్తులు హాజరవుతారు. అలాగే హుండీ ఆదాయం కూడా రోజుకు మూడు కోట్ల రూపాయలకు పైగానే శ్రీవారికి వస్తుంది. ఇంత పేరు ప్రతిష్టగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనలపై మాత్రం విచారణ ముందడుగు పడటం లేదు.
లడ్డూలో కల్తీపై...
ముందుగా తిరుమల లడ్డూ వ్యవహారం తీసుకుంటే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కల్తీ నెయ్యిని వినియోగించారంటూ ఆయన ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. అయితే దీనికి ఒక సమయం నిర్ధారించకపోవడంతో సిట్ టీం ఇంకా విచారణను కొనసాగిస్తూనే ఉంది. అసలు లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? లేదా? అన్న విషయంలో నిజం మాత్రం ఇంత వరకూ వెల్లడి కాలేదు. సిట్ టీం తిరుమలకు చేరుకుని విచారణను ప్రారంభించినా నెలలు గడుస్తున్నాదీనిపై అప్ డేట్ లేదు.
తొక్కిసలాటలో ఆరుగురు...
ఇక తిరుమలలో ఈ నెల 8వ తేదీన తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లు జారీ చేసేసమయంలో జరిగిన తొక్కిసలాట నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామార్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించారు. కొందరు అధికారులపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. దీనిపై కూడా విచారణ ముందడుగు పడలేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులను బదిలీ చేయడంతోనే సరిపెట్టారని, అందుకు కారణాలపై లోతుగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మరి ఎంతకాలం ఈ విచారణ సాగుతుందన్నది మాత్ర చూడాల్సి ఉంది.
Next Story

