Sun Mar 29 2026 11:27:45 GMT+0530 (India Standard Time)
Weather Report : టెంపరేచర్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయిగా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ అంచనా మేరకు వానలు పడతాయని చెబుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. నాలుగు రోజుల పాటు వానలు పడతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు నిజం కావడం లేదు. ఎందుకంటే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నఅభై నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు. తెల్లవారు జామున కొంత చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
రానున్న రోజుల్లో గరిష్టంగా...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పగటి వేళ వీలయినంత మేర బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నలభై నుంచి నలభైనాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండలు దంచి కొడుతూ...
తెలంగాణలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వారి అంచనాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను,మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ ను ప్రకటించింది.
Next Story

