Fri Dec 05 2025 16:15:22 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus for Women : మహిళలకు ఉచిత బస్సు కోసం ఆగాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇంకా ఎన్నాళ్లన్నది నేతలకే అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మహిళలకు ఉచితబస్సు ప్రయాణం కోసం రాష్ట్రంలో మహిళలంతా ఎదురు చూస్తున్నారు. కానీ అదిగో.. ఇదిగో.. అంటూ ఉచిత బస్సురాక వాయిదా పడుతూనే వస్తుంది. వాయిదా ఎంత కాలం పడుతుందన్నది సంబంధిత శాఖ మంత్రులకే తెలియడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అంచనా వేసి కమిటీ నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి విజిల్ మోగలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటి బ్యూరో సమావేశంలో మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని చెప్పారు. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారంగా మారకూడదనేనా?
ఈ పాటికే మంత్రుల దగ్గర నుంచి అనేక మంది టీడీపీ నేతలు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ వారి ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్పించి ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఉగాదికి అనుకంటే అప్పుడు జరగలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఈ పథకం అమలు చేయకపోవడానికి కారణాలు మాత్రం అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి భారంగా మారకూడదని, ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందుకు ఈ పథకాన్ని అమలులో ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారని ఊహించినా అది గ్రౌండ్ లోకి రాలేదు.
ఇప్పుడే అమలు చేస్తే...
జిల్లాల వరకే మహిళలకు ఉచిత ప్రయాణమన్నక్లారిటీని ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. దీనివల్ల ఆర్టీసీపై పెద్దగా భారం పడబోదని, కేవలం విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో మాత్రమే కొంత ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుందన్న అంచనాలయితే ఉన్నాయి. అయితే వరసగా అన్ని పథకాలను అమలుచేసి ఖజానాపై భారం మోపే కన్నా ఒక్కొక్కటిగా అమలు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఒక్కసారి అమలులోకి ఉచితంగా ప్రయాణం పథకం అమలులోకి వస్తే ఇక ఆరునూరైనా నాలుగేళ్ల పాటు అమలు చేయాలి. అదే ఎంత జాప్యం చేస్తే అంత కాలం కలసి వస్తుందన్న ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే మహిళలూ ఉచిత బస్సు మీ ఊరికి రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరో రెండు నెలల్లో అయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.
Next Story

