Fri Dec 05 2025 13:38:44 GMT+0000 (Coordinated Universal Time)
TDP : సీనియర్లు సిద్ధం కావాల్సిందేనా... మళ్లీ పిలుపు వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత మంత్రి వర్గంలో దాదాపు పది మందిపై అసంతృప్తిలో ఉన్నారని తెలిసి సీనియర్ నేతలలో ఆశలు పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత మంత్రి వర్గంలో దాదాపు పది మందిపై అసంతృప్తిలో ఉన్నారని తెలిసి సీనియర్ నేతలలో ఆశలు పెరిగాయి. మార్పులు తప్పవని మొన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, వార్నింగ్ ల తర్వాత మళ్లీ పెద్దోళ్లలో ఆశలుపెరుగుతుున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియారిటీ అని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాధ్యతలను స్వీకరించినా ఖచ్చితంగా కొందరు కేబినెట్ లో ఉంటారు. గత మూడు సార్లు అదే జరిగింది. 1995, 1999, 2014 లో చంద్రబాబు కాబినెట్ ఆ ఫేస్ లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ కూర్పులో కొత్త ముఖాలకు చోటు కల్పించారు.
నాటి సీఎం అంటే అదేనంటూ...
చంద్రబాబు మంత్రివర్గం సమావేశంలో మరొక మాట కూడా అన్న విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని తనలో చూస్తారని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి చూస్తే నాటి నుంచి అనేక మంది మంత్రులు యాక్టివ్ గా ఉండేవారు. మీడియా సమావేశాలు ఎప్పటికప్పుడు పెడుతూ అప్పటి ప్రతిపక్షాలపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేసేవారు. సబ్జెక్ట్ పై అవగాహన ఉండటంతో అనర్గళంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేవారు. నీటిపారుదల శాఖ కాని, హోంశాఖ కానీ, విద్యుత్తు శాఖ కానీ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ ఇలా అన్ని శాఖలపై అందరూ పట్టున్న వారే కావడంతో విపక్షాల విమర్శలకు దీటైన సమాధానం గణాంకాలతో చెప్పేవారు.
పట్టీపట్టనట్లుగా...
అయితే ఇప్పుడున్న కొత్త మంత్రుల్లో కొందరు, సీనియర్ నేతలుగా ఉన్న మరికొందరు ఎందుకో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యత కలిగిన శాఖలను ఇచ్చినప్పటికీ వారు సరైన టైంలో సరైన రీతిలో స్పందించలేదన్న కొరవ చంద్రబాబు లో స్పష్టంగా కనపడుతుంది. అది ప్రతిపక్షానికి అడ్వాంటేజీగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. భయమా? లేక అవగాహన లోపమో? తెలియదు కానీ గత ఏడాది కాలంలో మంత్రివర్గంలో చాలా మంది మౌనంగానే ఉంటుండటం విపక్షానికి వరంగా మారింది. సవాల్ కు ప్రతి సవాళ్లు లేవు. అలాగే విపక్షం చేసే కౌంటర్లకు తిరిగి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబు మార్చేయాలన్న యోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.
మార్పు గ్యారంటీ అని...
మార్పు ఎప్పుడన్నది తెలియకపోయినా .. మార్పు గ్యారంటీ అన్న సంకేతాలు మాత్రం బలంగా నేతల్లోకి వెళ్లాయి. చంద్రబాబు హెచ్చరికల తర్వాత కుర్ర మంత్రులు కొంత కలవరపడి స్పందిస్తున్నా అప్పటికే ఇచ్చిన సమయం దాటి పోవడంతో పాటు ఈ బ్యాచ్ తో ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమేనని చంద్రబాబు అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే సీనియర్లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో పెద్దోళ్లు మళ్లీ పంచెలు బిగించి పసుపు పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లే కనిపిస్తుంది.
Next Story

