Fri Dec 05 2025 20:24:37 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : జిడ్డుగా తగులుకున్న వానలు.. వదలేవంటమ్మా?
రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు పడతాయని చెప్పింది. నేడు నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశముందని వాతావరణ శాఖఅధికారులు తెలిపారు.తిరిగి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలతో పాటు, నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో ఉండటంతో వానలు పడతాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. అనంతపురం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే పిడుగులు పడే అవకాశమున్నందున పశువుల కాపర్లు, రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 18వరకూ...
తెలంగాణలో ఈ నెల 18వ తేదీ వరకూ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అదేసమయంలో ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
Next Story

