Fri Dec 05 2025 12:37:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిల మరోదారి వెతుక్కోవాల్సిందేనా? కాంగ్రెస్ లో కంఫర్ట్ గా లేరా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పునరాలోచనలో పడ్డారా? కాంగ్రెస్ లో కొనసాగితే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని ఆమె ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పునరాలోచనలో పడ్డారా? కాంగ్రెస్ లో కొనసాగితే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదని ఆమె ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళుతున్నారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు దాదాపుగా నూకలు చెల్లినట్లే. అసలు ఓటు బ్యాంకు కూడా లేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ అధినేత జగన్ కొల్లగొట్టుకుని వెళ్లిపోయారు. ఆ ఓటు బ్యాంకును తిరిగి సాధించడం మాత్రం జరిగే పని కాదు. ఒకవైపు అనాలోచితంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను క్షమించకూడదని ప్రజల్లో బలంగా సెంటిమెంట్ నాటుకుపోయింది.
ఓటు బ్యాంకు లేక...
అదే సమయంలో జగన్ పార్టీకి దాదాపు పదేళ్ల నుంచి అలవాటుపడిపోయిన ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ వైపునకు చూసే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఎన్ని మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు వైఎస్ కుమార్తె అయిన షర్మిలను తెచ్చిపెడితే కనీసం కొన్ని సీట్లు అయినా రకపోతాయా? అని భావించి ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. షర్మిల కూడా పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఇక పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ పై ఆశలు వదిలేసుకుంది. అందుకే పెద్దగా ఏపీ పాలిటిక్స్ ను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు.
కాంగ్రెస నాయకులు కూడా...
రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ దేశమంతా అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తున్నప్పటికీ ఏపీ పేరును ఎత్తకపోవడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరొకవైపు వైఎస్ షర్మిల నాయకత్వంపై కూడా చాలా మంది నేతలలో ఉన్న అపోహలు తొలిగిపోయాయంటున్నారు. షర్మిల తన పదవిని అడ్డం పెట్టుకుని కేవలం తన సోదరుడు జగన్ పై విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, వ్యక్తిగత విభేదాలకే పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు. అందుకే పార్టీలో సీనియర్ నేతలు హర్షకుమార్, చింతామోహన్ వంటి నేతలు కూటమి ప్రభుత్వంపై గళం విప్పాల్సి వస్తుందంటున్నారు. ఈ సమయంలో వైఎస్ షర్మిల వేరే దారి వెతుక్కోవాల్సిందేనా? అన్న అభిప్రాయం ఆమె అనుచరుల నుంచి వినిపిస్తుంది. కాంగ్రెస్ లో ఎన్నాళ్లున్నా ఇంతే పరిస్థితి అని వారు షర్మిలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మరి వైఎస్ షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
News Summary - has apcc chief ys sharmila had second thoughts? it is learnt that she has come to a clarity that she will have no political future if she continues in the congress
Next Story

