Fri Dec 05 2025 19:33:23 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : జీవోలు విడుదల తెలియకుండానే జరిగిందా? సమాచార లోపమా? లేక?
తుని రైలు దగ్దం కేసును తిరగదోడే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది

కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తుని రైలు దగ్దం కేసులో తిరిగి అప్పీల్ కు వెళ్లాలని తొలుత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఆ జీవో విడుదల తర్వాత మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించింది. తుని రైలు దగ్దం కేసును తిరగదోడే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రై్ల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. వెంటనే ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేయాలని కూడా వెంటనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చిన వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడుతూ తాము అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని, ఈ జీవో ఎలా విడుదలయిందన్న దానిపై ఆరా తీసింది.
ఫైలు ఎక్కడి నుంచి?
ప్రభుత్వం నుంచి ఒకముఖ్యమైన విషయానికి సంబందించి ఉత్తర్వులు విడుదల కావాలంటే దానికి సంబంధించిన సమాచారాన్ని కనీసం సంబంధిత శాఖ మంత్రికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫైలు ఏ స్థాయిలో ఆమోదం పొందుతూ నడిచిందన్న దానిపై ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తుంది. కాపులకు సంబంధించి సున్నితమైన అంశం కావడం, అందులో ముద్రగడ పద్మనాభం ఉన్నప్పటికీ కాపు రిజర్వేషన్ల కోసం సాగిన ఉద్యమంలో జరిగిన ఘటన కావడంతో వెంటనే ప్రభుత్వం సీరియస్ గా చర్యలకు దిగింది. అయితే ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు జారీ అయినట్లు గుర్తించారు.
చంద్రబాబు సీరియస్...
ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేసే ముందు తమను సంప్రదించకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ జీవో విడుదలయిందా? లేక కావాలని ఎవరైనా ఈ జీవో విడుదలకు పూనుకున్నారా? అన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అంతేతప్ప ఇలా జీవోలు తమకు తెలియకుండానే విడుదలయితే భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినట్లు సమాచారం. వెంటనే బాధ్యులు ఎవరో గుర్తించి ఈ జీవో విడుదలకు గల కారణాలను గుర్తించి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
Next Story

