Tue Jan 06 2026 20:01:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : గొట్టిపాటి లక్ష్మికి.. శిద్ధా ఇలా చెక్ పెడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వైసీపీ గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జుల హవా నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వైసీపీ గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జుల హవా నడుస్తుంది. అనేక రకాలుగా వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు తాము ఓటమి పాలయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి అధికారంలో ఉండటంతో తామే అనధికారిక ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమే వారు ఈ పని చేస్తున్నారన్నది నిజం. కానీ అదే సమయంలో ప్రజల నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేల విషయంలో ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు.
ఇన్ ఛార్జిగా ఉన్నప్పటికీ...
ప్రధానంగా అధికారులు తమను కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ టీడీపీ ఇన్ ఛార్జులు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయిన గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు. 2014–19 మధ్య దర్శి నియోజకవర్గంలో అభివృద్ధిని నాడు మాజీ మంత్రి శిద్ధారాఘవరావు చేపట్టినా నేడు కూడా గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గాన్ని తన ఇన్ ఛార్జి పదవితోనే అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు. అయితే తాజా పరిణామాలు గొట్టిపాటి లక్ష్మి వర్గానికి మింగుడు పడటం లేదు.
శిద్ధా వస్తున్నారంటూ...
గొట్టిపాటి లక్ష్మీ ఎన్నికలకు కేవలం 30 రోజులు ముందే వచ్చి ధైర్యంగా దర్శి నియోజకవర్గంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జ్ హోదాలో ఉన్న గొట్టిపాటి లక్ష్మి, తాను చేయగలిగినంత మేరకు దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు రాబడుతున్నారు. దర్శి లో శివాజీ నగర్లో క్రికెట్ స్టేడియం, దర్శి టౌన్లో డ్రైనేజ్ నిర్మాణానికి 1.5 కోట్లు మంజూరు చేయించారంటున్నారు. అన్నా కాంటీన్, టీటీడీ కళ్యాణ మండపం తీసుకు వచ్చారంటున్నారు. అయితే గత కొన్నాళ్లుగా టీడీపీలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తిరిగి వస్తున్నారని టీడీపీలోని కొందరు ప్రచారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శిద్ధా రాఘవరావు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన తర్వాత, తదుపరి ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో చరిత్రలో లేనంత భారీ మెజారిటీతో వైసీపీ గెలిచిన సంగతి మర్చిపోవద్దంటూ టీడీపీ నేతలే హెచ్చరిస్తున్నారు.
Next Story

