Thu Jan 29 2026 04:37:16 GMT+0000 (Coordinated Universal Time)
సీమ ప్రాంత రైతులు తీపి కబురు.. మీ పంటలకు ఇక దిగులులేదు
కర్నూలు వాసులకు గుడ్ న్యూస్. రాయలసీమలో మరొక పరిశ్రమ ఊపిరి పోసుకోనుంది

కర్నూలు వాసులకు గుడ్ న్యూస్. రాయలసీమలో మరొక పరిశ్రమ ఊపిరి పోసుకోనుంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఉండగా, రాయలసీమలో వేసవి కాలంలో గొంతులు చల్లబరిచే క్యాంపా కోలా ఫ్యాక్టరీ భారీ పెట్టుబడులతో ముందుకు రానుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో 80 ఎకరాలలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 1,622 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ క్యాంపా కోలా మెగా ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ హబ్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.
పన్నెండు వందల మందికి...
దాదాపు 1,200 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంత వాసుల వలసలకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రెడ్ కార్పెట్ పరచడమే కాకుండా, ఏడాదికి దాదాపు 500 కోట్ల జిఎస్టీ రాబడితో రాష్ట్ర ఖజానాకు ఇది వెన్నుముకలా మారనుంది. ఇది రిలయన్స్ చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా 768 కోట్లతో ఏర్పాటు చేయబోయే స్నాక్స్ మరియు బిస్కెట్ల ఫుడ్ పార్క్ ద్వారా ఈ ప్రాంత సరఫరా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది.
ఉద్యాన వన పంటలకు..
ఈ ప్లాంట్ వల్ల కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే కాదు, ఫ్రూట్ జ్యూస్‌ల ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో జరగబోతోంది. ఇది మన రాయలసీమ ఉద్యానవన రైతులకు ఎంతో ఉపయోగ పడుతుంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పండే బత్తాయి, మామిడి, పప్పాయ వంటి పండ్లకు ఇకపై మద్దతు ధర కోసం రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు. రిలయన్స్ నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలుదారుగా మారుతుంది. పండ్లను పండ్ల లాగే కాకుండా, జ్యూస్‌లుగా మార్చి వాల్యూ ఎడిషన్ చేయడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి ఆ మొదటి క్యాంపా కోలా బాటిల్ బయటకు రానుంది..
Next Story

