Fri Dec 05 2025 16:00:25 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ లో నేడు మహిళలకు శుభవార్త. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేటి నుంచి అమలు కానుం

ఆంధ్రప్రదేశ్ లో నేడు మహిళలకు శుభవార్త. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేటి నుంచి అమలు కానుంది. ఇందుకు అవసరమైన బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 74 శాతం బస్సులను ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేటి నుంచి అమలు కానుంది. మహిళలకు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం అమలు చేసిన చంద్రబాబు సర్కార్ నేటి నుంచి ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టనుంది.
ఐదు రకాల బస్సులు...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి మహిళలు పర్యటించేందుకు ఐదు రకాల బస్సులకు అనుమతి ఇచ్చారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తున్నారు. మిగిలిన బస్సుల్లో మాత్రం అనుమతించరు. ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి నుంచి తిరుమలకు మాత్రం సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణానికి అనుమతించబోమని తెలిపారు.
ఒకేసారి ప్రారంభం
ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుండటంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఆ యా జిల్లా కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ఉదయం స్వాతంత్ర్య దినోత్స వ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆయన విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ బస్ స్టేషన్ లో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఫస్ట్ ఫ్రీ జర్నీ టిక్కెట్ ను ఇచ్చి బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల మహిళలకు ఒక్కొక్కరికి నెలకు 800 వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు అవసరమైన అనవసరమైన సిబ్బందిని కూడా నియమించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది.
Next Story

