Fri Dec 05 2025 12:42:25 GMT+0000 (Coordinated Universal Time)
Allagadda : ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం కదలికలు లేవే.. కారణమిదేనా?
ఆళ్లగడ్డలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల కుటుంబం ఎటు వెళ్లింది? అఖిలప్రియ దెబ్బకు నిలబడలేకపోతున్నారా? లేక మౌనంగానే కొంతకాలం ఉండటం మంచిదని భావిస్తున్నారా? అన్నదిమాత్రం తెలియడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి మాత్రం యాక్టివ్ గా పాల్గొనడం లేదని తెలిసింది. ఆయన తన వద్దకు వచ్చే కార్యకర్తలతో సమావేశం కావడం మినహాయించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటనలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. అందుకే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి కొంత కాలం వెయిట్ చేసిన తర్వాత తిరిగి యాక్టివ్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డిని పార్టీ నాయకత్వం ఇటీవల ప్రశ్నించిందని సమాచారం.
మూడు దశాబ్దాల తర్వాత గెలిచి...
ఆళ్గగడ్డలో 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియను ఓడించి గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను భూమా కుటుంబం కోల్పోయింది. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబాన్ని రంగంలోకి దింపిన వైసీపీ విజయం సాధించింది. గంగుల కుటుంబం ఎప్పటి నుంచో ఆళ్లగడ్డపై పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. 1985లోనే గంగుల కుటుంబం ఆళ్లగడ్డ నుంచి గెలిచింది. ఆ తర్వాత 2019 వరకూ ఆ కుటుంబానికి గెలుపు దక్కలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత గంగుల ఇంట్లో గెలుపు బాజాలు వినిపించాయి. 2019 ఎన్నికల్లో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. దీంతో భూమా కుటుంబానికి సరైన ప్రత్యర్థి గంగుల అని ప్రజలు కూడా గుర్తించినట్లయింది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగానే...
అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పాటు ఆళ్లగడ్డలోనూ గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి కూడా డీలా పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి పాలయినా ఆళ్లగడ్డలో తమ గెలుపు ఖాయమని భావించారు. కానీ ఆళ్లగడ్డ ప్రజలు కూడా గంగుల బిజేంద్రనాధ్ రెడ్డిని ఓడించారు. దీంతో ఆయన ఒకింత డీలా పడ్డారని తెలిసింది. దీంతో పాటు అఖిలప్రియ భూమా కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను కూడా సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారన్న కామెంట్స్ ఆళ్లగడ్డలో వినిపిస్తున్నాయి. గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి మరోసారి తన గెలుపు ఖాయమని, అయితే మరికొంత కాలం తర్వాత పార్టీలో యాక్టివ్ అవుతానని సన్నిహితులకు చెబుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద అఖిలప్రియ దెబ్బకు గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారంటూ సెటైర్లు వినపడుతున్నాయి.
Next Story

