Wed Dec 17 2025 14:42:45 GMT+0000 (Coordinated Universal Time)
Anna Datha SukhI Bhava : మే నెలలో రైతుల ఖాతాల్లో పడేది ఎంతంటే?
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో మే నెల నుంచి జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో మే నెల నుంచి జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు మాత్రం ఆరు వేలు మాత్రమే పడతాయి. అంతకు మించి రైతులు కూడా ఆశించే అవకాశం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే రైతులకు మూడు విడతలుగా ఆర్థిక సాయాన్ని అందచేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలకు మరో నాలుగు వేల రూపాయలు కలిపి అన్నదాతల ఖాతాల్లో నిధులు మే నెలలో జమ చేయనున్నారు.
మొదటి విడతగా...
ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరువేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. మొత్తం మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది. అయితే పీఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు పెట్టుబడి సాయాన్ని అన్నదాత సుఖీభవ పథకాన్నిఅందచేస్తామని ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద నాలుగు వేల రూపాయలు మొదట విడత జమ చేయనుుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు విధివిధానాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అన్నదాత సుఖీ భవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది.
42 లక్షల మందికేనా?
కేంద్ర ప్రభుత్వం పీఎం సమ్మాన్ నిధులు విడుదల చేసిన సమయంలో ఈ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించడంతో పీఎం కిసాన్ సమ్మాన్ నుంచి అందుతున్న వారే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ఉండనున్నారు. అంటే పీఎం కిసాన్ నిధులు ఎవరికైతే పడతాయో వారికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అందే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 60లక్షల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులుంటే 42లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ జారీచేసే పీఎం కిసాన్ నిధులు మంజూరు కానున్నాయి. వీరికి మాత్రమే నిదులు అందే అవకాశముంది. వేరే వారికి ఈ నిధులు అందే అవకాశాలు లేవన్నది అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Next Story

