Fri Dec 05 2025 14:56:56 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus For Women : ఉచిత బస్సు ప్రయాణం అంత ఈజీ కాదా? సర్వీసులు ఎక్కువ ఉన్నా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిన్నటి నుంచి ప్రారంభమయింది. మహిళలు ఎక్కువగా బస్సులను వినియగించుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిన్నటి నుంచి ప్రారంభమయింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి విధివిధానాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన అధికారుల, మంత్రుల బృందం అక్కడ అధ్యయనం చేసి వచ్చి లోటుపాట్లను గమనించిన తర్వాత విధివిధానాలను విడుదల చేసింది. ఐదు బస్సుల్లో అనుమతించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్ని బస్సుల్లోనూ అమలు చేయాలంటే అది ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతుంది.
డబ్బులు చెల్లించే వారికి...
మరొకవైపు డబ్బులు చెల్లించి ప్రయాణం చేస్తున్న వారికి ఇబ్బంది కలుగుతుంది. నిజమే .. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కుదరదని చెప్పడం సరైన చర్యేనని అంటున్నారు. రోజూ తిరుపతి నుంచి వేల సంఖ్యలో తిరుమలకు భక్తులు వెళుతుంటారు. సప్తగిరి బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. ఎక్కువ బస్సులున్నప్పటికీ వేగంగా తనిఖీలు చేయడం సిబ్బందికి కత్తిమీద సాము అవుతుంది. అమరావతి, ఇంద్ర, వెన్నెల, గరుడ, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ వంటి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే ఇక అందరూ అవసరం లేకపోయినా ప్రయాణాలు పెట్టుకుంటారు. అందుకే కొన్నిసర్వీసులుకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం అమలు చేయడం సబబేనని అంటున్నారు.
ఈ బస్సుల్లోనే....
ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ,సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి సర్వీసులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణం అమలు చేయనుంది. అంటే ఇవి ఎక్కువగా జిల్లాల పరిధి దాటవు. రాష్ట్రంలో పర్యటించాలంటే ఈ బస్సుల్లో ప్రయాణిస్తూ అనేక చోట్ల దిగి గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎవరో కొందరు తప్పించి అలాంటి సాహసం చేసే అవకాశం ఉండకపోవచ్చు. దూర ప్రయాణం చేయాలంటే అమరావతి, ఇంద్ర, వెన్నెల, గరుడ, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ వంటి బస్సుల్లో టిక్కెట్ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అయితే ఇందులోనూ తొలినాళ్లలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర పరిధిలో ప్రయాణాలకు మాత్రం వీటిని ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశముంది.
74 శాతం బస్సుల్లో...
ఉచిత ప్రయాణం మొదలయిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణం దగ్గర ప్రయాణం చేసే వారికి మాత్రం సులువు. అదే దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే. కానీ దూరప్రాంతాలకు మహిళలకు ఎక్కువగా కుటుంబ సభ్యులతో ప్రయాణించాలనుకుంటారు. అందులోనూ ఆరువేల బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో అందరు మహిళలు ఈ ఉచిత ప్రయాణం సాహసానికి ఒడిగట్టే అవకాశం లేదన్న అంచనాల్లో అధికారులున్నారు. అందుకే ఆగస్టు నెలాఖరుకు కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంత మంది వినియోగించుకున్నారన్న దానిపై స్పష్టత రానుంది.
Next Story

