Fri Dec 05 2025 14:59:51 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి మళ్లీ జైలుకేనా? బ్రదర్స్ కు అరదండాలు తప్పవా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ తగలడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు పల్నాడు పోలీసులు సిద్ధమయ్యారు. పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్య కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలానికి చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వీరిద్దరూ ఏ6, ఏ7 నిందితులుగా పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
ముందస్తు బెయిల్ రద్దుతో...
అయితే రాజకీయ కక్ష సాధింపు తోనే తమపై అక్రమ కేసులు బనాయించారని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో వారికి ముందస్తు బెయిల్ లభించింది. గతంలో ఎన్నికల సందర్భంగా ఈవీఎం బాక్సులను ధ్వంసం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారిపై దాడికి యత్నించిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైలులో కొన్ని నెలల పాటు ఉండి శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో కూడా వీరిని నిందితులుగా చేర్చడంతో ముందస్తు బెయిల్ ను హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అయితే ఈరోజు పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది.
టెక్నికల్ ఎవిడెన్స్ కూడా...
పల్నాడు జిల్లాలో జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించారు. వీరు ఒక రెస్టారెంట్ లో సమావేశమై హత్యకు కుట్రపన్నారని, ఫోన్ లో కూడా మాట్లాడారని, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉందని న్యాయస్థానానికి న్యాయవాదులు చెప్పారు. వాస్తవాలు బయటకు రావాలంటే పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్ప వెల్లడి కావని వాదించారు. వారిద్దరిపై రౌడీషీట్ కూడా ఉందని, గతంలో నేర చరిత్ర కూడా ఉందని చెప్పడంతో హైకోర్టు ముందస్తు బెయిల్ ను కొట్టివేసింది.
Next Story

