Fri Feb 14 2025 18:53:44 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : కేశినేని నాని ఎక్కడ? తిరిగి యాక్టివ్ అవుతారా?
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగయిపోయారు

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగయిపోయారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన గెలుపుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. గెలిచే పార్టీ నుంచి ఓటమిని తెచ్చిపెట్టే పార్టీ వైపు ఆయన మొగ్గుచూపారు. కనీసం ట్రాక్ రికార్డు చూసైనా కేశినేని నాని తన నిర్ణయాన్ని తీసుకోలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. వాపును చూసి తన బలం అనుకుని ఆయన నిలువునా మునిగిపోయారని భావించారు. వ్యాపారంలనూ, రాజకీయాల్లోనూ కేశినేని నాని ఇబ్బందులు పడటానికి ఆయన ఇగో కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పట్టువిడుపులకు పోకపోవడం వల్లనే హ్యాట్రిక్ సాధించి రికార్డుల కెక్కాల్సిన కేశినేని నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటున్నారు.
ట్రాక్ రికార్డు తెలిసీ...
కేశినేని నానికి తొలి నుంచి కొంత దూకుడు ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడంలో వెనకా ముందూ ఆలోచించరు. అసలు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో మూడు సార్లు వరసగా గెలిచిన వారు లేనే లేరు. అదొక సెంటిమెంట్ కావచ్చు. లేక బెజవాడ వాసులు హ్యాట్రిక్ విజయానికి మొగ్గుచూపకపోవచ్చు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండుసార్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, చెన్నుపాటి విద్య మాత్రమే గెలిచారు. ఒకే ఒక్కరు మూడు సార్లు విజయం సాధించారు. కానూరి లక్ష్మణరావు 1962, 1967, 1971 లో గెలిచారు. ఆ తర్వాత అంటే 1971 తర్వాత అంటే ఐదు దశాబ్దాల నుంచి మూడు సార్లు వరసగా గెలిచిన వారు లేనే లేరు.
మూడోసారి గెలుస్తానని...
కానీ కేశినేని నాని మాత్రం మూడోసారి తాను గెలుస్తామని భావించారు. టీడీపీని తక్కువగా అంచనా వేశారు. ఢిల్లీలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని ఆయన భావించారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా కనీసం బొకే ఇచ్చేందుకు కూడా ఆయన నిరాకరించి పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. మరొకవైపు లోకేష్ నాయకత్వాన్ని కూడా కేశినేని నాని ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలతోనూ సఖ్యతగా మెలగలేదు. దేవినేని ఉమ, బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి వారితో కయ్యానికి దిగారు. ఇలా అనేక రకాలుగా కేశినేని నాని తీసుకున్న నిర్ణయాలకు ఆయన సోదరుడు కేశినేని శివనాధ్ తోనే టీడీపీ చెక్ పెట్టగలిగింది.
గత ఎన్నికలకు ముందు...
2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయిన కేశినేని నాని తన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. వ్యాపారాన్ని క్లోజ్ చేసినట్లుగానే ఆయన రాజకీయాల నుంచి కూడా నిష్క్రమించినట్లు ప్రకటించారు. కానీ ఎన్నికల నాటికి మళ్లీ కేశినేనినాని బయటకు వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కేశినేని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లే కనిపిస్తుంది. సన్నిహితులకు, ఆయను నమ్మి పదేళ్ల పాటు వెంట తిరిగిన వారికి కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు. తిరిగి టీడీపీలోకి వస్తారా? లేక వైసీపీలో యాక్టివ్ అవుతారా? అన్నది చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద బెజవాడ పార్లమెంటు ట్రాక్ రికార్డు తెలిసీ కేశినేని నాని చేసుకున్న స్వయంకృతం ఆయనను అజ్ఞాతంలోకి పంపేలా చేసిందన్న కామెంట్స్ వినడుతున్నాయి.
Next Story