Fri Dec 05 2025 09:07:41 GMT+0000 (Coordinated Universal Time)
Rk Roja : వైసీపీకి రోజాతో లాభమా? నష్టమా? అంటే... పార్టీ నేతలే ఏమంటున్నారంటే?
వైసీపీకి మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి వారు అస్సెట్ అవుతారనుకుంటే భారంగా మారుతున్నారు

వైసీపీకి మాజీ మంత్రి రోజా లాంటి వారు అస్సెట్ అవుతారనుకుంటే భారంగా మారుతున్నారు. బరువుగా పార్టీకి తయారవుతున్నారు. అరెస్ట్ లతో కాస్తో కూస్తో వైసీపీకి సానుభూతి లభిస్తుందని భావిస్తే, రోజా లాంటి వారితో ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోతుంది. రోజా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు.. సాధారణ జనానికి కూడా మంట తెప్పిస్తున్నాయి. రోజా లాంటి నేతల నోళ్లను కొన్నాళ్లపాటు అదుపులో పెట్టకపోతే జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ తీరని నష్టం జరుగుతుందన్న విశ్లేషణల్లో వాస్తవముంది. రోజా నోటికి ప్లాస్టర్ వేయాలని సొంత పార్టీ నేతలే కోరుతున్నారంటే ఆమె ఏ రేంజ్ లో మాట్లాడిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జగన్ ఇటువంటి నేతల విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకోవాలంటున్నారు.
తన వ్యాఖ్యలతో తానే...
ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిందే. అయితే ఆ వ్యాఖ్యలతో వచ్చిన సానుభూతిని రోజా తన వ్యాఖ్యలతో తనకు తానే చెరిపేసుకున్నారు. పార్టీని కూడా డ్యామేజ్ చేశారు. నగరిలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న రోజా రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గాలిలో గెలిచిన గాలిగాళ్లే ఎక్కువైపోయారంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీకెండ్ నాయకులు అని ఫైర్ అయ్యారు. ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టం ఏంటో అడగరని రోజా అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని చెప్పారు. చంద్రబాబు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారని అందుకే పవన్ కళ్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందంటూ ఆరోపించారు.
రోజా హెచ్చరికలతో...
రాష్ట్రంలో గాలిలో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువైపోయ్యారు. ఇప్పుడే హైదరాబాద్‌కు పారిపోయే వాళ్లు.. రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్లు హైదరాబాద్ కాదు.. అమెరికాకు పారిపోతారంటూ రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీని ఖచ్చితంగా ఇబ్బది పెట్టేవే. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరు ఉండరని, వీళ్లని నమ్మితే ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లని మీరు టార్చర్ పెట్టినా.. కేసులు పెట్టించినా.. కొట్టినా.. దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామంటూ రోజా చేసిన హెచ్చరికలతో కాస్తో కూస్తో వైసీపీ నేతల వరస అరెస్ట్ లతో వచ్చిన సానుభూతి పోయిందని అంటున్నారు. రోజాకు ఆవేశం తప్ప ఆలోచన లేదని, సినీ రంగం నుంచి రావడంతో డైలాగులు ఆకట్టుకునేలా అనిపించినా అవి మాత్రం వచ్చే ఓట్లను రాకుండా చేస్తాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

