Fri Mar 21 2025 08:05:18 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : వంశీ ఇక జైలు గోడల మధ్యే మగ్గాల్సిందేనా? వరస కేసులు రెడీ అవుతున్నాయా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే వరసగా వంశీపై కేసులు నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే వల్లభనేని వంశీ క్రిమినల్ రికార్డును పరిశీలించిన పోలీసులు అందుకు సంబంధించి ఫిర్యాదుదారులను కూడా సంప్రదిస్తున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. గత పదేళ్లుగా గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటిన్నింటినీ జల్లెడ పడుతున్నారు. ఫిర్యాదుదారులు నాడు ముందుకు రాకపోయినా నేడు వచ్చి తమకు కంప్లయింట్ చేయాలని సూచిస్తున్నారు.
జైలులో మగ్గిపోయేలా...
వల్లభనేని వంశీ చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు వల్లభనేని వంశీ పేరు ఉందన్న ప్రచారం జరుగుతుంది. అయితే పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలతో వంశీని అరెస్ట్ చేసి జైలులో మగ్గేలా చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు వెయిట్ చేసింది. వల్లభనేని వంశీ పై కేసులు నమోదవుతాయని భావించినప్పటికీ ఇంత త్వరగా ఆయన మెడకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చుట్టుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఊహించని విధంగా ఈ కేసు నమోదు కావడంతో పాటు నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు నమోదు చేయడంతో వల్లభనేని వంశీకి న్యాయమూర్తి పథ్నాలుగు రోజులు రిమాండ్ కు తరలించారు.
నకిలీ పట్టాలు...
ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ ఉన్నారు. దీంతో పాటు మరి కొన్ని కేసులు కూడా పోలీసులు సిద్ధం చేస్తున్నారు. జైల్లో ఉండగానే వల్లభనేని వంశీపై వరస కేసులు నమోదు చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలు సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అప్పట్లో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. దీనిపై గతంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ కేసు రీఓపెన్ చేయమని పిటిషన్ వేయడంతో కేసులపై పునర్విచారణ చేపట్టారు. మట్టి తవ్వకాలపై... వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. 210 కోట్ల రూపాయల వరకు మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా తవ్వకాలు జరిపినట్లు విజిలెన్స్ నివేదికలో తెలిపారు.
మరో పది కేసులు...
దీంతోపాటు గన్నవరం ప్రాంతంలో మరికొందరు వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిసింది. అధికారంలో ఉండగా తన అనుచురులతో కలిసి వంశీ తమను బెదిరించారని, తమ ఆస్తులను కాజేశారంటూ మరికొందరు ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దాదాపు పది కేసులకు పైగానే వంశీ కోసం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అదే జరిగితే వల్లభనేని వంశీ ఇక జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒకదాని వెంట ఒక కేసు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరొక కేసులో కూరుకుపోయేలా చేయాలని పక్కాగా పోలీసులు కేసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని గన్నవరం టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతుండటం విశేషం.
Next Story