Fri Dec 05 2025 14:59:34 GMT+0000 (Coordinated Universal Time)
Kotla : ఇంటిపేరు కనుమరుగవుతుందనేనా? పెద్దాయన నలిగిపోతున్నారా?
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారా? లేదా? అని అనిపించేలా ఉంది

మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారా? లేదా? అని అనిపించేలా ఉంది. గతంలో ఏ పదవీ లేనప్పుడే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యాక్టివ్ గా తిరిగే వారు. అంతేకాదు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఇంటిపేరు తెరమరుగు కాకుండా సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్నించేవారు. కానీ 2024 ఎన్నికల నాటి నుంచి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎందుకో మౌనంగా ఉండటంతో పాటు ఒక శాసనసభ నియోజకవర్గానికే పరిమితయ్యారు. ఒకప్పుడు కర్నూలు జిల్లాను శాసించిన కోట్ల కుటుంబం ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమయింది. ఇక పార్టీలోనూ ఆయనకు పెద్దగా ప్రయారిటీ కనిపించకపోవడంతో తాను పార్టీ మారి తప్పు చేశానా? అన్న ఆలోచనలో పడిపోయారంటారు.
కర్నూలు పార్లమెంటు అంటే....
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. ఇప్పటికీ కోట్ల ఫ్యామిలీకి కర్నూలు జిల్లాలో మంచి పేరుంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అక్కడి నుంచి గెలిచి కాంగ్రెస్ హయాంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పార్టీలో చేరిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా నీరసం తెప్పించాయని చెప్పాలి.
కేబినెట్ లో చోటు దక్కుతుందని...
డోన్ నియోజకవర్గం నుంచి కూటమి హవాలో గెలుపొందిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా అది జరగలేదు.దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చాలా రోజుల తర్వాత శాసనసభకు పోటీ చేశారు. నిజానికి ఆయన కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉన్నా చంద్రబాబు డోన్ టిక్కెట్ ఇవ్వడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆయన శాసనసభకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన ఎన్నికల వేళ నేరుగా కూడా ప్రజలతో చెప్పారు. తాను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉందని, అయితే అనివార్య కారణాలతో పోటీ చేయలేకపోయానని కన్నీటి పర్యతంతమయ్యారు. నిజానికి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ వైపు చూడలేదు. ఢిల్లీ వైపు ఆయన చూపు ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఆ గౌరవం వేరు అని ఆయన భావిస్తారు. కుటుంబానికి ఉన్న ప్రతిష్టతో పాటు గౌరవం కూడా నిలబడుతుందని ఆయన అనుకుంటారు.
కోట్లకు మంత్రి పదవి ఇస్తే...
కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డిలు మంత్రులుగా ఎంపిక చేేసుకోవడంతో కోట్ల సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తే కేఈ కుటుంబానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు కుటుంబాలకు రాజకీయ వైరం ఈ నాటిది కాదు. అందుకే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని చంద్రబాబు పక్కన పెట్టారన్న వాదనల్లో కూడా నిజముంది. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరు కావడం లేదు అని చెబుతున్నారు. డోన్ లో అప్పుడప్పడు పర్యటిస్తూ తాను ఎమ్మెల్యే అనేకంటే మాజీ ఎంపీగానే ఆయన చెలామణి అవుతూ తిరుగుతున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రం ఏం చేయలేని పరిస్థితుల్లో మౌనంగానే ఉంటూ ఈ నాలుగేళ్లు గడిస్తే చాలు అని అనుకుంటున్నారట.
Next Story

