Thu Jul 07 2022 08:39:39 GMT+0000 (Coordinated Universal Time)
ఇక అందరికీ అందుబాటులో ఉంటా

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ న్యూస్ లోకి వచ్చారు. ఆయన చిత్తూరు జిల్లా కలికిరికి వచ్చారు. తన కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డిని పరిచయం చేశారు. నిన్న మధ్యాహ్నం కలికిరి చేరుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు నల్లారితో వ్యక్తిగత పరచయమున్న నేతలందరూ గెస్ట్ హౌస్ కు వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డితో కలసి రావడం చర్చనీయాంశమైంది.
భూమి రిజిస్ట్రేషన్ కోసం....
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన నగరిపల్లెలో భూమిని కొనుగోలు చేశారు. దాని రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన వచ్చినట్లు వారితో చెప్పారు. మరలా త్వరలో వస్తానని అన్ని విషయాలను మాట్లాడుకుందామని తనను కలసిన వారితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాను అందరికీ త్వరలో అందుబాటులోకి వస్తానని చెప్పారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. తిరిగి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అవుతున్నారని అంటున్నారు.
Next Story