Thu Mar 27 2025 03:23:34 GMT+0000 (Coordinated Universal Time)
Harsha Kumar : హర్షకు వైసీపీలో లైన్ క్లియర్ అయిందా?
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఆయన ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హర్షకుమార్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ ఒకే ఒక నిర్ణయానికి వచ్చి వైసీపీలో చేరేందుకు సిద్ధమయినట్లు తూర్పు గోదావరి నియోజకవర్గంలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. హర్షకుమార్ తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ వారసుల రాజకీయ భవిష్యత్ కోసమే హర్షకుమార్ వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.
రెండుసార్లు గెలిచి...
2004, 2009 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన హర్షకుమార్ కు తర్వాత రాజకీయంగా కలసి రాలేదు. 2014 ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డి తో ప్రయాణించి ఆ తరువాత సమైక్యాంధ్ర పార్టీ వైఫల్యం తో హర్ష కుమార్ రాజకీయ భవిత అంధకారంలో పడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ లో చేరతారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. వైసిపి, జనసేన లకు షిఫ్ట్ అవుతారనుకున్నా ఆ పార్టీలనుంచి హర్ష కుమార్ కి ఆఫర్ దక్కలేదు. ఈ సమయంలో అధికారంలో ఉన్న టిడిపి ఆహ్వానం అందుకున్నారు హర్ష కుమార్. మూడు దశాబ్దాలకు పైగా తన కాంగ్రెస్ రాజకీయ జీవితంలో టిడిపి పై అలుపెరగని పోరాటం చేశారు హర్ష కుమార్. అయితే అనివార్య పరిస్థితుల్లో టిడిపి లోకి చేరాల్సి వచ్చింది.
టిక్కెట్ రాకపోవడంతో...
చంద్రబాబు సమక్షంలో కాకినాడ సభలో 2019 ఎన్నికలకు ముందు సైకిలెక్కారు హర్ష కుమార్. ఈ సందర్భంగా అయన బాబు కి పాదాభివందనం చేయడం ఆయన అభిమానుల్లో అలజడి రేపింది. ఈ అంశాన్ని వైసిపి బాగా ప్రచారంలో పెట్టడంతో హర్ష హర్ట్ కుమార్ ఆత్మాభిమానం దెబ్బతింది. దీనికి తోడు అమలాపురం పార్లమెంట్ టికెట్ హర్ష కుమార్ కు ఇస్తానని చెప్పి బాలయోగి కుమారుడికి చివరి నిమిషంలో మార్పు చేయడం తో ఒక్కసారిగా పొలిటికల్ గా ఆయన బ్లాక్ అయిపోయారు. విమర్శలువెల్లువెత్తడంతో తెలుగుదేశం పార్టీని నాడు ఓడించాలని పిలుపునిచ్చి సైకిల్ దిగిపోయి సైలెంట్ అయిపోయారు. తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం హర్ష కుమార్ దళిత ఉద్యమాలు చేస్తూ కాలం వెల్లబుచ్చారు.
టీడీపీపై విమర్శలు...
అయితే ఇప్పుడు టీడీపీలో ఖాళీలేదు. జనసేనలో చేరేందుకు ఆయన సుముఖంగా లేరు. బీజేపీలో జాయిన్ అయ్యేందుకు కూడా ఆయన సుముఖంగా లేరు. దీంతో హర్షకుమార్ వైసీపీలో చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలిసింది. అయితే తనకోసం కాదట. తాను కాకండా ఈసారి అమలాపురం ఎంపీ టిక్కెట్ తన కుమారుడికి ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపారంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం హామీలు అమలుపర్చడం లేదని విమర్శలు చేస్తున్నారని, అలాగే వైసీపీ ప్రభుత్వమే మేలని, పథకాలు అమలు చేసిందన్న పొగడ్త కూడా చేరికకు మార్గం సుగమం చేసుకోవాలన్న తాపత్రయమేనని చెబుతున్నారు. మరి జగన్ హర్షకుమార్ ను పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
Next Story