Fri Dec 05 2025 19:59:19 GMT+0000 (Coordinated Universal Time)
Fake Liquor : డబ్బులిచ్చి మరీ చావుకు అడ్రస్ చెబుతున్నట్లుందిగా
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం సంచలనం సృష్టిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం సంచలనం సృష్టిస్తుంది. మద్యం ప్రియులు ఏ రకమైన మద్యాన్ని తాగుతున్నారో.. తెలియడం లేదు. డబ్బులిచ్చి మరీ చావును కొనితెచ్చుకుంటునట్లుంది. బ్రాండెడ్ మద్యాన్ని మాత్రమే అమ్మకాలు జరుపుతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ములకల చెరువు ఘటన ఒక మయాని మచ్చ. ఈ నకిలీ మద్యం తయారీదారులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సరే కల్తీ మద్యం విషయంలో మాత్రం ఒకింత ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మద్యం విషయంలో కూటమి ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మంచి పేరు రాలేదు. వైసీపీ హయాంలో బ్రాండ్లు కంటే మద్యం ధరలు ఆధారంగా తాగే వారి బడ్జెట్ బట్టి కొనుగోళ్లు ఉండేవి.
ములకల చెరువులో...
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం ములకల చెరువులోని కదిరినాధుని కోటలో ఒక ఇంట్లో దాగిన రహస్య బయటపడింది. ఎక్సైజ్ శాఖ జరిపిన దాడిలో కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడ్మిరల్ బ్రాంది, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్ పేరిట బాటిల్స్ లో తయారు చేసి బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. పాల వ్యాన్ ల ద్వారా తరలిస్తున్నారు. అంతే కాదు ఇందులో ప్రధాననిందితుడు అద్దేపల్లి జనార్ధన్ తాను అమాయకుడనని నమ్మించే ప్రయత్నం ఇప్పటికే మొదలు పెట్టారు. పార్టీపై బురద జల్లడానికే ఈ ప్రయత్నం జరిగిందని తనను తాను రక్షించుకోవడానికి ఒక ప్లాన్ వేసినట్లయింది. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తంబళ్లపల్లిలో పోటీ చేసిన జయచంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు.
పన్నెండు మంది అరెస్టయినా...
ఈ కేసులో ఇప్పటి వరకూ పన్నెండు మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అత్యంత పకడ్బందీగా ఈ మద్యం రాకెట్ ను నడుపుతున్నారు. ఎన్నాళ్ల నుంచి సాగుతుందో కానీ ఈ వ్యవహారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని నలుమూలలకు ఈ కల్తీ సరుకు పంపిణీ జరిగినట్లు ఎక్సైజ్ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. తమిళనాడు, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులతో ఈ నకిలీ మద్యం తయారీని చేస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ కల్తీ మద్యం విషయంలో సీరియస్ గా ఉన్నారు. నిందితులు ఎవరైనా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు ఆదేశాల వల్లనే ఈ అరెస్ట్ లు జరిగాయని టీడీపీ నేతలు సమర్ధించుకుంటున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయందనుకోవాలి.
కూటమి ప్రభుత్వానికి...
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి అధికం. 2019జూన్ తో పోలిస్తే జూలై, ఆగస్టు నాటికి 100- 150 శాతం పైగా ధరలు పెరిగాయి. 2019- 2024 మధ్య ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు ఏటా 25వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు కూడా ఆదాయం అటుఇటుగా అంతే ఉంది. దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి. ఈ మద్యం వ్యాపారాలు ఎవరి చేతుల్లో ఉంటాయి అనేది ఇంకో లెక్క. ఎక్సైజ్ శాఖకు ప్రైవేట్ మీద ప్రభుత్వ నియంత్రణ ఎలా ఉంటుందో తెలిసిందే. మద్యం బ్రాండ్ల లభ్యత పెరిగినా, 99 రూపాయల చౌక మద్యం అందుబాటులోకి వచ్చినా, ధరలు తగ్గలేదు అనేది జనం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలు మించి ఆదాయం వచ్చే వనరు ప్రభుత్వానికి ఇంకోటి లేదు. ఖజానా, ఆదాయం లెక్కల్లో డీబీటీ పంపకాలు ఎన్ని చేసినా జనం పెద్దగా హర్షించరు. ఉచిత పంపకాలు ఎన్ని చేసినా , తమ జేబుల్లో నుంచి ఎంత పోతుంది అనేది కూడా జనం లెక్క వేసుకుంటారు. ఎన్ని డబ్బులు పంచినా జన ఓట్లు రాల్చరని ఇప్పటికే రుజువైందని అందరికీ తెలిసిందే.
Next Story

