Thu Dec 18 2025 07:27:38 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నాడు
ఆరు నెలలకు ఒకసారి ఏపీకి వచ్చి పవన్ కల్యాణ్ జగన్ ను తిట్టడం మామూలుగా మారిపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

ఆరు నెలలకు ఒకసారి ఏపీకి వచ్చి పవన్ కల్యాణ్ జగన్ ను తిట్టడం మామూలుగా మారిపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పట్టుమని పది రోజులు ఏపీలో ఎప్పుడైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి వచ్చి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోవడం తప్ప పవన్‌కు మరో పనిలేదన్నారు. నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు వినటం తప్ప ఆయనకు ఏం తెలుసునని నిలదీశారు. టీడీపీని పది కాలాల పాటు పచ్చగా ఉంచాలన్నదే పవన్ థ్యేయమని తెలిపారు. రైతుల పరామర్శ కోసం చంద్రబాబుకు తోడుగా పవన్ వచ్చారన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఏ ఒక్కరోజైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. టీవీ టీఆర్పీ రేటింగ్లాగా పవన్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
కాపుల సమస్యలపై...
కాపుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఏనాడైనా పోరాడారా? అని పేర్నినాని ప్రశ్నించారు. కాపు యువకుడి చేత కోటి రూపాయల వారాహి వాహనం చేయించుకుని, దానిని మూలన పడేశారన్నారు. దసరాకు వస్తామన్నారు. తర్వాత వారాహి వేసుకుని తిరుగుతామని చెప్పారు. ఇప్పుడు జూన్ నుంచి ఇక్కడే ఉంటానని చెబుతున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టినట్లుందని అన్నారు. చంద్రబాబు కోసమే అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి డైలాగులు చెప్పి వెళతాడన్నారు. కులాన్ని రెచ్చగొట్టేందుకు పవన్ వచ్చి పోతుంటారన్నారు.
వందకోట్ల సినిమా ఏదైనా ఉందా?
కాపులతో పాటు ప్రజలను కూడా తనకు ఓటు వేయలేదని నిందించడమేంటని అన్నారు. కాపులను మోసం చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించ లేకపోతున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసినప్పుడు పవన్ ఏం చేశాడని పేర్ని నాని నిలదీశారు. కాపులను దగా చేసింది చంద్రబాబు, పవన్ కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం బరితెగించి పవన్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాపులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పవన్ సినిమా వందకోట్లు దాటింది ఏదైనా ఉందా? సినిమా బాగాలేకపోతే జగన్ ఏం చేస్తారని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ను తిడితే మాట్లాడవని, అదే చంద్రబాబును ఏదైనా మాటంటే మాత్రం ఉలిక్కిపడి ట్వీట్లు చేస్తావని ఎద్దేవా చేశారు.
Next Story

