Fri Dec 05 2025 12:40:59 GMT+0000 (Coordinated Universal Time)
Balineni : బాలినేని ఒంటరివాడయినట్లేనా? ఎవరూ రాకపోవడానికి రీజన్ ఇదేనా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చేందుకు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. అందుకే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎంతగా ప్రయత్నించినా కొందరు నేతలు సున్నితంగా తిరస్కరిస్తుండగా, మరికొందరు నేతలు మాత్రం తాము వైసీపీని వదిలి రాలేమని తెగేసి చెబుతున్నారు.
జిల్లాపై పట్టున్న నేతగా...
బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఉన్నారు. నాడు పీసీసీ చీఫ్ గా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట.. చేసిందే శాసనం అన్నట్లు ఉండేది. నాటి నుంచి 2019 ఎన్నికల వరకూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు దక్కేవి. అందుకే బాలినేని అందరు నేతలతో టచ్ లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, తర్వాత జనసేనలో చేరిపోవడం ఒకరకంగా మిగిలిన నేతలకు కూడా షాకింగ్ కు గురి చేశాయి.
బాలినేని వెంట..?
కానీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడితే అనేక మంది నేతలు కూడా ఆయన వెంట పోలోమంటూ క్యూ కడతారని భావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే ఊహించారు. అందుకే బాలినేనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాలినేని చేరి నెలలు కావస్తున్నా ఒక్క పేరున్న నేత కూడా ప్రకాశం జిల్లా నుంచి రాకపోవడం జనసేనలోనూ చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, హామీలు అమలు చేయకపోవడం, తిరిగి జగన్ పుంజుకునే అవకాశాలుంటాయన్న అంచనాలు వినపడుతుండటంతో నేతలు పార్టీని వీడి వచ్చేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. బాలినేని వదలకుండా ప్రయత్నిస్తున్నా కార్పొరేటర్లు మినహా మరో ముఖ్యనేత ప్రకాశం జిల్లాలో ఆయన వెంట రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు.
మానుగుంట కూడా...
తాజాగా మరో ముఖ్యమైన వార్త వినపడుతుంది. కందుకూరు మాజీ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కూడా జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఆయనతో బాలినేని మాట్లాడారని, త్వరలోనే జనసేన గూటికి వస్తారన్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో పెద్దయెత్తున నడిచింది. జగన్ వైఖరితో కలత చెంది తీవ్ర అవమానభారంతో వైసీపీని మానుగుంట మహీధర్ రెడ్డి వీడతారన్న ప్రచారంలో మాత్రం నిజం లేదని అంటున్నారు. ఆయన కూడా బాలినేని సంప్రదించినా వెనక్కు తగ్గినట్లు తెలిసింది. దీంతో బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాను ఊహించినట్లు.. అనుకున్నట్లు ఎవరూ తన వెంట రాకపోయేసరికి డీలా పడినట్లు బాలినేని సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

