Sun Dec 08 2024 05:39:53 GMT+0000 (Coordinated Universal Time)
Balineni : బాలినేని ఇలా అడ్డం తిరిగారే.. ఇక వైసీపీలోకి నో ఎంట్రీయేనా?
బాలినేని శ్రీనివాసులరెడ్డి డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. ఇక ఫ్యాన్ పార్టీ వైపు చూసే అవకాశం లేనట్లే కనిపిస్తుంది
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పూర్తిగా డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. ఇక ఫ్యాన్ పార్టీ వైపు చూసే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైనా, పార్టీ చీఫ్ సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేసి పార్టీకి పూర్తిగా దూరమయినట్లేనని చెప్పక తప్పదు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేనపార్టీలో ఆయన చేరడానికి అనేక కారణాలున్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యర్థులను తట్టుకునేందుకు ఆయన గాజు గ్లాస్ పార్టీని ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ కూడా బాలినేనిని సాదరంగానే ఆహ్వానించారు.
జగన్ పై నేరుగా విమర్శలు...
అయితే జనసేనలో తాను చేరి ఏ పదవి కోరుకోవడం లేదని బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు. అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. కానీ దానిని బాలినేని కొట్టిపారేస్తున్నారు. తనకు ఏ పదవి అవవసరం లేదని చెబుతున్నారు. అయితే అదానీతో జరిగిన ఒప్పందంలో తనకు ప్రమేయం లేదని బాలినేని చెబుతున్నారు. తన చేత బలవంతంగా సంతకాలు చేయించేందుకు అర్ధరాత్రి ప్రయత్నించారని, అయితే తాను కేబినెట్ అనుమతికి పంపడంతోనే దానిని ఆమోదించారని, తన డిజిటల్ సైన్ ను కూడా వైసీపీ నేతలు చేసి ఈ అవినీతిలో వాళ్ల తప్పు లేదని నిరూపించుకునే అవకాశముందని బాలినేని బహిరంగంగానే చెబుతున్నారు.
చెవిరెడ్డిపై విమర్శలు...
అదేసమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై కూడా బాలినేని తీవ్రంగా విమర్శలను బాలినేని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.అయితే బాలినేని మాగుంటకు ఇవ్వాలని చెప్పినా అందుకు జగన్ వినలేదు. చెవిరెడ్డికి ఇవ్వడంతో బాలినేని అయిష్టంగానే ఒప్పుకున్నారు. చివరకు చెవిరెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఈ విషయంలో చెవిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో బాలినేని విరుచుకుపడ్డారు. అదానీతో ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పడంతో పాటు జగన్ వైపు వేలెత్తి చూపారు. జగన్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిపై బాలినేని ఫైర్ అవ్వడం చూస్తుంటే వైసీపీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తుంది.
ఆయన కుమారుడు ఎంట్రీకి...
బాలినేనిశ్రీనివాసులురెడ్డి జనసేనలో చేరినప్పటికీ ఆయన కుమారుడు వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన కుమారుడు వైసీపీ ఎంట్రీకి అడ్డం పడ్డాయనే చెప్పాలి. అందుకే బాలినేని కుటుంబాన్నిఇక భవిష్యత్ తో వైసీపీ అధినేత జగన్ దగ్గరకు తీయకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ కొత్త నేతకు ఒంగోలు నియోజకవర్గం టిక్కెట్ కోసం సరైన అభ్యర్థిని వెదుకులాడాల్సి ఉంటుంది. బాలినేని పార్టీకి దూరం కావడంతో ఆయన ప్లేస్ కోసం అనేక మంది వైసీపీ లో పోటీ పడుతున్నారు. మరి బాలినేని కుటుంబానికి మాత్రం ఫ్యాన్ పార్టీలో దారులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు.
Next Story