Wed Jan 21 2026 11:39:08 GMT+0000 (Coordinated Universal Time)
Ongole News : బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఎందుకు చేరినట్లు? ఏం సాధించినట్లు?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఒంటరయినట్లే కనిపిస్తుంది. గతంలో జిల్లాను మొత్తం శాసించిన బాలినేని ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా పట్టుకోల్పోయారు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఒంటరయినట్లే కనిపిస్తుంది. గతంలో జిల్లాను మొత్తం శాసించిన బాలినేని ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా పట్టుకోల్పోయారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక బాగానే జరిగినప్పటికీ.. కొన్ని నెలల నుంచి ఆయనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. చివరకు ఒంగోలు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా మొహం చాటేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనకు నేతలు వంగి వంగి సలాములు చేసే వారు. జిల్లాల్లో అసెంబ్లీ టిక్కెట్లు కూడా ఆయన చెప్పిన వారికే వచ్చేవి. చివరకు పార్లమెంటు సభ్యులను సయితం ఆయన కంట్రోల్ లో పెట్టారంటారు.
అందరూ దూరంగానే...
కానీ జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ఇటు వైసీపీలో ఉన్న క్యాడర్ కు కూడా ఇష్టం లేదు. అలాగే తాను చేరిన జనసేన పార్టీలో ఉన్న నేతలకు, కార్యకర్తలు కూడా సుముఖంగా లేరు. పార్టీ పదవులు జిల్లాల్లో ఇస్తున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఆయనను పార్టీ నాయకత్వం సంప్రదించే పరిస్థితుల్లో లేదు. పవన్ కల్యాణ్ తనను కొన్ని సార్లు ప్రశంసించడంతో తనకు ప్రాధాన్యత ఇస్తారని నమ్మి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డికి దాదాపు ఏడాది గడిచినా ఎటువంటి పదవి దక్కలేదు.చివరకు జిల్లా ఇన్ ఛార్జి పదవి దక్కలేదు. నామినేటెడ్ పదవిని దక్కించుకున్న రియాజ్ వంటి వారు కూడాబాలినేని శ్రీనివాసరెడ్డిని పట్టించుకోవడం లేదు.
ఫ్లెక్సీల్లోనూ కనిపించని...
జనసేన నేతలు ఎక్కువ మంది జిల్లా నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తో టచ్ లో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జనసేనలో చేరిన నేతలు మినహా పాత నేతలు ఎవరూ ఆయన దగ్గరకు రావడం లేదు. దీంతో ఒంగోలులోని బాలినేని ఇల్లు బోసిపోయి కనిపిస్తుందంటున్నారు. ఇక జనసేనకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఆయనకు పిలుపు లేదు. కనీసం జనసేన నేతలు వేస్తున్న ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫొటో కనిపించడం లేదు. దీంతో ఆయన జనసేనలో ఎందుకు చేరినట్లు? ఏమి సాధించినట్లు? అన్న కామెంట్స్ ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులో ఉండకుండా ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతూ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. చివరకు బాలినేని పరిస్థితి ఇలా తయారైందేమిటన్న వ్యాఖ్యలు ఒంగోలులో వినపడుతున్నాయి.
Next Story

